లక్ష్యం కోసం ఒకటి కాదు.. రెండు కాదు వెయ్యిసార్లయినా ప్రయత్నించాలి. అదీ కుదరకపోతే.. మరోసారి ప్రయత్నం చేయాలి. హర్యానా లోని బాల గఢ్ లోని ఓ దళిత వాడకు చెందిన ఓ కుర్రాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తనకు ఇష్టమైన హాబీని విడిచిపెట్టలేదు. తన లక్ష్యం కోసం హోటల్ లో ప్లేట్లు కడిగాడు. క్లీనర్ గానూ అవతారమెత్తాడు. ఎంతో శ్రమించి భారత హాకీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. త్వరలో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ లో మనదేశం తరపున ఆడనున్నాడు ఈ కుర్రాడు.
ధాబాల్లో ప్లేట్లు కడిగి..
సుమిత్ ది నిరుపేద దళిత కుటుంబం. తండ్రి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. నిత్యం ఆకలితో ఆలమటించే కుటుంబంలో పుట్టాడు సుమిత్. చిన్నప్పట్నంచే హాకీ అంటే తెగ ఇష్టం. ఒక్క మాటలో అదే ప్రాణం. తన కలను నెరవేర్చుకోవడానికి హైవే పక్కన ధాబాలో క్లీనర్ గా పనిచేశాడు. ఒక్కోసారి పని దొరకపోతే రొట్టెతోనే కడుపు నింపుకునేవాడు. అలాంటి పరిస్థితుల్లో హాకీ ప్రయాణం మొదలుపెట్టాడు. ఆర్థిక పరిస్థితులు కారణంగా సుమిత్ అన్న మధ్యలోనే హాకీ వదిలేశాడు. కానీ సుమిత్ మాత్రం హాకీని విడిచిపెట్టలేదు. లిఫ్ట్ అడిగి హాకీ స్టేడియం వెళ్లేవాడు. అది కుదరకపోతే.. పదికిలోమీటర్లు సైకిల్ తొక్కి ప్రాక్టీస్ చేసేవాడు. ఏడేళ్ల పాటు ధాబాలో ప్లేట్లు కడిగాడు. వచ్చిన డబ్బుతోనే హాకీ ప్రాక్టీస్ చేసేవాడు.
టర్నింగ్ పాయింట్
సుమిత్ కు అతికష్టం మీద గుర్‌గావ్‌లో ఉన్న స్పోర్ట్స్ హాస్టల్‌లో సీటు దొరికింది. హాస్టల్‌లోనే ఉండి శిక్షణ తీసుకున్నాడు. అరకొర వసతుల మధ్యే హాస్టల్ జీవితం ప్రారంభించాడు. అక్కడ తనలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారని తెలుసుకున్నాడు. కొంతమంది మిత్రుల సాయంతో యూజీసీ నెట్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులో శిక్షణ తీసుకున్నాడు. 2017లో సుల్తాన్ అజ్‌లాన్ షా కప్‌తో హాకీ కెరీర్ ను మొదలుపెట్టాడు. 2018 కామన్ వెల్త్ గేమ్స్ లో సైతం సుమిత్ తన ప్రతిభ చాటాడు. అంతర్ రాష్ర్టాల పోటీలకు వెళ్లేందుకు.. చార్జీలకు కూడా డబ్బులు ఉండేవి కావు. దీంతో సుమిత్ రైళ్లలో దొంగచాటుగా ప్రయాణం చేసేవాడు.
హర్యానా టు టోక్యో
హాకీలో విశేషంగా రాణిస్తున్న సుమిత్ తన జీవిత కలను నెరవేర్చుకున్నాడు. 16 మంది సభ్యులుండే భారత హాకీ జట్టుకు ఎంపికయ్యాడు. టోక్యో ఒలింపిక్స్ మనదేశం తరపున ఆడనున్నాడు. 2017లో సుమిత్ ఓఎన్‌జీసీలో ఉద్యోగం కూడా వచ్చింది. దీంతో అద్దె ఇంటి నుంచి సొంతింటి మారాడు. ‘‘కుటంబ పోషణ కోసం మేము కష్టపడ్డాం, నాన్న కూలీ పనిచేసి అండగా నిలిచాడు. కొన్నేండ్ల క్రితమే అమ్మ చనిపోయింది. ఆమెకు విమానంలో ప్రయాణించాలని కోరిక. తాను ఇప్పుడు ఉంటే.. విమానంలో తీసుకెళ్లేవాడి’’ అని అంటాడు సుమిత్.
Must Read ;- ఆటో డ్రైవర్ కొడుకు.. ఫ్లయింగ్ ఆఫీసర్ అయ్యాడు!