ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ దాదాపు ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఇప్పటికే కీలక పాత్రధారులు, సూత్రధారులు అంతా కటకటాలు లెక్కపెడుతున్నారు. ఇక మిగిలింది బిగ్‌బాస్ అరెస్టు మాత్రమే. బిగ్‌బాస్ అరెస్టుకు అవసరమైన అన్ని సాక్ష్యాలు, ఆధారాలను సిట్ ఇప్పటికే సేకరించింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న వార్తలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఐతే ఈ కేసులో కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డి సిట్‌తో షాకింగ్ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారు పేరు చెబితే తనకు అంతిమ ఘడియలు వచ్చినట్లేనని, అదే తనకు చివరి రోజు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మీరు ఏం చేసినా తాను ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పలేనని సిట్ అధికారుల ముందు రాజ్ కసిరెడ్డి తలదించుకుని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు రోజుల సిట్ కస్టడీలో భాగంగా లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ వైఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ప్రశ్నించడానికి సిట్ అధికారులు వంద ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. రెండు రోజులపాటు ప్రశ్నించినా..తమకేమీ తెలియదని బుకాయించారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తే లిక్కర్ కేసులో అరెస్టయిన అధికారులు, ఇతర వ్యక్తులకు ప్రాణహాని ఉందని అర్థమవుతోంది. గతంలో వై.ఎస్ వివేకా హత్య కేసులో నిందితులు, కొంత మంది సాక్షులు అనుమానస్పద స్థితిలో చనిపోయారు. ఇదే తరహాలో లిక్కర్ స్కామ్‌లో బిగ్‌బాస్ పేరు బయటకు వస్తే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు, సాక్షులకు సైతం అదే రీతిలో ముప్పు ఉందన్న ప్రచారానికి రాజ్ కసిరెడ్డి చెప్పిన మాటలు బలాన్ని చేకూరుస్తున్నాయి.