మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు పాప జన్మించింది. మంగళవారం తెల్లవారు జామున జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. చరణ్- ఉపాసనలకు 2012లో వివాహమైంది.
వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకలను కూడా కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పెళ్లయిన చాలా కాలం తర్వాత రామ్ చరణ్ తండ్రయ్యాడు. ఈ వార్త తెలిసిన వెంటనే మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. వెల్ కమ్ టు మెగా ప్రిన్సెస్ అంటూ నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అపోలో ఆస్పత్రి వద్దకు కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు.
బిడ్డ పుట్టింది కదా ఈ దంపలు వేరు కాపురం పెడతారా అన్న వార్తలకు ఉపాసన ఇంతకుముందే చెక్ చెప్పారు. సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని, తాము దానికి పూర్తి భిన్నమని ఉపాసన ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం తాను, చరణ్.. అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నామని, బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామల తోనే ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్ర పోషించారని, వారితో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవాలని లేదని చెప్పారు.