రామ్ గోపాల్ వర్మ సోమవారం నాడు హైదరాబాదులో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా ముంబాయిలో నివాసం ఉండే వర్మ స్వయంగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పుస్తకావిష్కరణ చేశారనగానే.. ఎవరికైనా అది ఎంత గొప్ప పుస్తకమో? రచయిత ఎంత గొప్పవారో? అందులో ఉండేది ఎంత గొప్ప విషయమో? అని ఆసక్తి చూపిస్తారు. అసలు సంగతి తెలిస్తే మాత్రం అవాక్కు కాక తప్పదు.
హైదరాబాద్ సొమాజీ గూడాప్రెస్ క్లబ్ లో రేఖా పర్వతాల ‘వర్మ మన ఖర్మ’ అనే టైటిల్‌తో రాసిన పుస్తకాన్ని రాంగోపాల్ వర్మ స్వయంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత్రి తన గురించి రాసిన విషయాలను ఆయన సభికులతో పంచుకున్నారు. కేవలం పుస్తకాన్ని ఆవిష్కరించడం మాత్రమే కాదు.. పుస్తకానికి ఆయన విపరీతంగా ప్రమోషన్ కూడా చేశారు. తన మాటల్లో పుస్తకం పట్ల అందరిలో ఆసక్తి రేకెత్తేలా వర్మ సంగతులు పంచుకున్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ పుస్తకం పేరు నెగిటివ్ గా ఉన్నా.. చదివితే తన జీవితం మొత్తం తెలుస్తుందన్నారు. ‘నేను ఎప్పుడూ ఒక ఫిలాసఫర్ ను ఫాలో కాలేదు. నేను ఏది సీరియస్ గా తీసుకోను. ఒక పెళ్ళిలో ఒక ఐపిఎస్ ఆఫీసర్ కలిశారు. మీ పుస్తకం వల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయ్ అని చెప్పారు. నేను మాట్లాడేది పిచ్చి వాగుడు అనొచ్చు.. ఇంటలెక్చువల్ అని మరికొందరు అనొచ్చు.. కానీ ఆ వ్యాఖ్యలు ఏవీ తాను పట్టించుకోను అని వర్మ చెప్పారు. అలాగే తాను చెప్పదలచుకుంది తాను చెప్తానే తప్ప.. దానిని ఎవరు ఎలా తీసుకుంటారనేది గానీ, ఎవరు తన పట్ల ఎలా ప్రతిస్పందిస్తారనేది గానీ తాను పట్టించుకోను అని వర్మ వివరించారు. నా గురించి ఏమి రాస్తారో, రాసారో అని ఎదురు చూడను అని అన్నారు. ప్రతి మనిషులో ఒక మృగం, రాక్షసుడు ఉంటాడు. బ్యాడ్ ను కప్పి పెట్టి మంచిగా ఉండాలని చూస్తుంటారు అలా కాకుండా.. నువ్వనుకున్నదే చేయి.. నీలానే ఉండటానికి ప్రయత్నించు అని చెప్పారు. బంధాల నుంచి బయటకు రాలేనప్పుడు నిజం గుర్తుకు వస్తుందని అన్నారు.
తాను ఈ పుస్తకం ఇంకా చదవలేదని, ‘నేను పుస్తకం రాస్తే… ఎలా కాపీ కొడతారు’ అనే దానిపై తానొక పుస్తకం రాస్తానని వర్మ వివరించారు. నేను ప్రాబ్లమ్ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. మా అమ్మ నన్ను చాలాసార్లు కొట్టారు. అప్పుడు వర్మ మా ఖర్మ అని అనుకుని ఉండొచ్చు అంటూ గుర్తు చేసుకున్నారు. బర్నింగ్ ఇష్యులు బర్నింగ్ అయిపోయాయని, సానిటైజర్, మాస్క్ ఎప్పుడూ వాడలేదని, కరోనా కోసం నా లైఫ్ స్టయిల్ మార్చుకోనని వర్మ చెప్పారు.
నిర్మాత బొమ్మక్ మురళి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మను ఓషన్ ఒఫ్ థాట్స్ గా అభివర్ణించారు. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అన్నారు. కొత్తదనానికి మారు పేరు వర్మ అని పేర్కొన్నారు.
నిజానికి కార్యక్రమం ‘వర్మ మన ఖర్మ’ అనే పుస్తకావిష్కరణే అయినప్పటికీ.. ‘వర్మ మన అదృష్టం’ అంటూ నిర్మాత మురళి ప్రకటించడం విశేషం.