పెన్మత్స రాంగోపాల్ వర్మ. చాలామందికి ఈ పేరు కలిగిన మనిషి ఒక దర్శకుడిగానే పరిచయం. కానీ.. నాకు మాత్రం ఒక సినిమా పిచ్చోడిగా, నన్ను సినిమా పిచ్చోడిగా మార్చిన వ్యక్తిగా తెలుసు. ఊహ తెలిసినప్పటి నుంచి స్వతహాగా సినిమాలంటే విపరీతంగా ఇష్టపడే నాకు రాంగోపాల్ వర్మ అనే నువ్వు ‘రాత్రి’ సినిమాతో పరిచయం అయ్యావ్. నిర్మానుష్యంగా ఉన్న చీకటి ఇంటి నుంచి ఖాళీ అయిన ఊరిని చూపిస్తూ తలుపులు తెరుచుకుంటున్న సందర్భంలో ‘WRITTEN&DIRECTED By RAMGOPAL VARMA’ అని డైరెక్టర్ పేరు కనిపించగానే వీడెవడ్రా బాబూ అనుకున్నాను. ఈ సినిమా చూశాక నీ టేకింగ్ కొత్తగా అనిపించి వరసబెట్టి నువ్వు డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ చూశాను. నీ సినిమాల్లో ఉన్న మెలోడీ సాంగ్స్‌ను చెవులారా విని మైమరిచిపోయేవాడిని. ‘అందమా.. అందమా’ అనే సాంగ్‌లో శ్రీదేవిని చూసిన నాకు ఆమె అంటే నీకు ఎందుకంత ఇష్టమో అర్థం చేసుకున్నాను. ‘నేను ఎవడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయలేదు.. విజన్ ఉంటే ఎవడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాల్సిన అవసరం లేదు’ అని నువ్వు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఒక క్రియేటర్‌గా నీకున్న క్లారిటీ చూసి ముచ్చటేసేది. కానీ.. ఇప్పుడు నువ్వు నీలా లేవు. నీలో ఉన్న నిన్ను నువ్వే చంపేసుకున్నావ్.
‘ఆస్కార్’ రేంజ్ సినిమాలు తీసే సత్తా ఉన్న నువ్వు.. నీ నుంచి సరైన సినిమా ఒక్కటి రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న నాలాంటి లక్షల మందిని పస్తులుంచుతున్నావ్. ‘మీరు మారిపోయార్ సార్ అని కాదు మీరు దిగజారిపోయారు సార్’ అని గట్టిగా నీ ముందు అరవాలని ఉంది. నిన్ను పట్టుకుని ‘రోజురోజుకూ ఎందుకింత ఇంత చిల్లరగా తయారై మమ్మల్ని వేధిస్తున్నావ్.. నిన్ను నువ్వు చంపుకున్న విషయాన్ని ఎందుకు పదేపదే గుర్తుచేస్తున్నావ్’ అని ఏడవాలని ఉంది. అప్పటికీ నువ్వు మారకపోతే మాకెందుకు ‘గాయం’ చేస్తున్నావ్ అని గట్టిగా నిలదీయాలని ఉంది. అయినా నువ్వు మారవని నాకర్థమైంది. కానీ.. నువ్వెందుకింత ‘Dangerous’గా తయారయ్యావ్. నిన్ను పిచ్చిగా అభిమానించే నాలాంటి లక్షల మందిని ‘Naked’గా ఎందుకు నిలబెడుతున్నావ్.
అమ్మాయి కాలి వేళ్లు నాకుతూ గొప్ప ఆరాధకుడిగా నువ్వు పొంగిపోయిన రోజే.. ‘నువ్వు ఇంతకు మించి దిగజారవ్ అనుకుంటున్న ప్రతీసారి’ You Prove Me Wrong. నీ ఇంటర్వ్యూలను, నీ రామూ ఇజాన్ని అణువణువునా నింపుకున్న నాకు నిన్నిలా చూస్తుంటే ఒకింత బాధగా, మరింత కోపంగానూ ఉంది. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు వాడుకుని వదిలేసే టిష్యూ పేపర్‌లా మారిన నిన్ను చూస్తుంటే అసహ్యమేస్తోంది. ఒక రాజకీయ పార్టీ ‘వ్యూహం’లో నీలాంటి క్రియేటర్ చిక్కుకుపోవడం చూసి కళామతల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. నీ దిగజారుడుతనానికి అంతూపొంతూ లేదా. రోజుకొక రోత పని చేయందే ఉండలేవా. నీలో ఉన్న డైరెక్టర్ నిన్నెప్పుడూ ఇలా ప్రశ్నించలేదా. అయినా నా పిచ్చితనం కానీ నీతో నువ్వు ఒంటరిగా ఎప్పుడున్నావ్‌లే. ఉంటే మగువతో లేదంటే మత్తులో. స్పృహలో ఉన్నప్పుడేమో.. ఒక రాజకీయ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ కొన్నాళ్లు పవన్‌ను, ఇంకొన్నాళ్లు చంద్రబాబును, ఇప్పుడు లోకేష్‌ను.. ఆ ‘ఫ్యాను’ గాలి కింద సేద తీరుతూ చిల్లర ట్వీట్లు, ఇంటర్వ్యూలు ఇచ్చే పనొకటి ఉంది కదూ. మర్చేపోయాను.
దర్శకుడిగా కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవాల్సిన నువ్వు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ లాంటి థర్డ్ గ్రేడ్ సినిమాలు తీసి ప్యాకేజ్ తీసుకునే స్థాయికి దిగజారడమేంటి వర్మా.. కర్మ కాకపోతే. 24 క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉన్న నీకు 24 గంటలూ ఇలా చీప్‌గా బతికే దుస్థితి రావడమేంటో. స్త్రీల అంగాంగ ప్రదర్శనను ఆదాయ మార్గంగా మార్చుకున్న నువ్వేనా ‘శివ’, ‘క్షణక్షణం’ లాంటి సినిమాలు తీసింది. ‘మీరు మారిపోయారు సార్.. మీలో ఉన్న క్రియేటర్ మీ నీచమైన లైఫ్‌స్టైల్ చూసి ఎప్పుడో పారిపోయాడు సార్’. బతికేయండి.. ఇలానే బతికేయండి. ‘వ్యూహం’ లాంటి కళాఖండాలే తీసుకుంటూ ఆ సొమ్ముతోనే తాగితూలండి. కానీ.. మీకు నా ఒకేఒక్క అభ్యర్థన ఏంటంటే.. 90స్‌లో మీరు తీసిన సినిమాల పేర్లు ఎవరికీ చెప్పకండి. ఎవడీ పిచ్చోడనుకుంటారు. రాంగోపాల్ వర్మ అనే పేరు ముందు ఉన్న దర్శకుడు అనే క్రియేటర్ వేదనను వోడ్కాలో కలుపుకుని తాగేయడం ఇకనైనా మానేయ్. ఆ రాజకీయ పార్టీకి, ఈ రాజకీయ పార్టీకి తొత్తులా పనిచేస్తూ నీ విజన్‌ను తాగుడుకు తాకట్టు పెట్టేయడం మానేస్తావా వర్మా.. అయినా నిన్ను అభిమానించాను చూడు. అది నా కర్మ.