కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ..!
తిరుమలలో పాలక మండలి, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు నిత్యం వివాదస్పదంగా మారుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్లో కొండ చర్యలు కూలి రాకపోకలకు అంతరాయం కలిగితే.. తిరిగి భక్తులకు స్వామి దర్శనం ఎప్పుడు కల్పించేది అన్న అంశంపై టీటీడీ ఛైర్మన్, ఈవో లు వెంటవెంటనే భిన్న ప్రకటనలు చేశారు. మొన్న ఉదయాస్తమాన సేవల టికెట్లను ఒక్కొక్కటి కోటిన్నర రూపాయాలు కేటాయించి, ఆల్ టైం అతిపెద్ద వివాదానికి తెరతీశారు. కోటిన్నర పెట్టి కొంటే 25 ఏళ్లుపాటు ఏడాదిలో ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారికి జరిగే అన్ని సేవల్లో పాల్గొని అవకాశం ఉంటుంది. సామాన్యులకు సైతం ఫ్రీగా అందే ఉదయాస్తమాన టికెట్లు.. నేడు కోట్ల రూపాయాలు డబ్బు వ్యచ్చించి కొనే విఐపీల పరం చేయడం ఏమిటని? భక్తులు నిలదీస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా టీటీపీ తీసుకొస్తున్న అడ్డగోలు నిబంధనల కారణంగా స్వామివారిని సామాన్య భక్తులకు దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని.. హిందుబంధువులు, స్వామీజీలు పెద్దఎత్తున్న ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వంశపార్యపర అర్చకులను ఉన్నతాధికారి బలవంతంగా టీటీడీ ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అర్చకులను పరిరక్షించాలని ఒకపక్క ప్రభుత్వం చెబుతూనే, మరోపక్క టీటీడీ అధికారులు ఆ వ్యవస్థను నిర్విర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ వెల్లవెత్తుతున్నాయి. దీనిపై ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్ష స్పందించారు. అధికారులు అర్చకుల పట్ల చూపుతున్న వివక్షపై కోర్టును ఆశ్రయించుతామని హెచ్చరించారు.