తెలంగాణలో తిరుగులేని ప్రత్యామ్నాయంలా షర్మిల ..!
తెలంగాణ రాజకీయాల్లో షర్మిల తిరుగులేని ప్రత్యామ్నాయ శక్తిగా మారుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ పార్టీ నేతలపై నిత్యం ఏదో ఒక సమస్య పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి సంధిస్తున్నారు. ఘాటు వ్యాఖ్యలతో తనదైన శైలిలో ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. నిరుద్యోగ సమస్యపై నిరాహార దీక్షలు చేస్తూ ఒకవైపు యువత, మరోవైపు రైతు పక్షాన కూడా నినదిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలను ఆరా తీస్తూ.. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి.. జిల్లాలు, ప్రాంతాల వారీగా పాదయాత్రలు చేస్తూ ప్రజల గోడు వింటూ ముందుకు సాగుతున్నారు.
రైతు కోసం ఏపీ వైపు కూడా షర్మిల అడుగులు ..!
తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై నిరాహారదీక్ష చేస్తున్న షర్మిల.. ప్రస్తుతం రైతు ఆవేదన యాత్రలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 19 నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. పంటలు పండక గిట్టుబాటు ధర లభించక అప్పులతో బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ఈ యాత్రలో చేస్తోంది. తెలంగాణకే పరిమితమైన వైయస్ షర్మిల రాజకీయ ప్రస్థానం ఏపీ వైపు కూడా విస్తరించే అవకాశాలు లేకపోలేదని పొటికల్ సర్కిల్స్ లో ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. రైతు సంక్షేమానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన బాటలోనే నడుస్తున్నట్లు చెప్పుకొస్తున్న షర్మిల.. ఏపీలో రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని, ఏపి రైతుల వాదనలు. ఈ నేపథ్యంలో ఏపీ రైతులకు కూడా షర్మిల భరోసా అవసరం. వైఎస్ తరువాత రైతు గోడు ఆలకించేది ఆ కుటుంబ నుంచి షర్మిల ఒక్కరేనని రైతులు కూడా నమ్ముతున్నారు. దీంతో షర్మిల అడుగులు ఏపిలో కూడా పడతాయని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఏపీలో షర్మిల రాజకీయం ప్రస్థానం ప్రత్యామ్నాయ శక్తిగా మారే అవకాశం లేకపోలేదని చెప్పారు. వైయస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టే రోజు ఎంతో దూరం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ ప్రోమోలో రఘురామ ఈ విషయాన్నే బహిర్గతం చేశారు. షర్మిల ఏపీలో అడుగు పెడితే.. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి తీవ్ర నష్టం తప్పదని కూడా అంచనా వేశారు ఎంపీ!