భారీ అంచనాలతో బాలీవుడ్ లో రూపొందుతున్న ‘బ్రహ్మస్త’ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సెప్టెంబరు 9న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ, డిస్నీ ఇండియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే సెప్టెంబరు 9ని లాక్ చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఆ రోజు అనంత చతుర్దశి. గణేశ నిమజ్జనం కావడంతో సెలవు కూడా వస్తుంది.
సెలవులు కలిసి వచ్చి వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టుకోడానికి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈలోగా ఆ తేదీపై ఎవరు కర్చీఫ్ వేస్తారో తెలియదు. అందుకే ముందుగానే విడుదల తేదీ ప్రకటించాలన్న నిర్ణయానికి నిర్మాతలు వచ్చారు. పైగా ఇందులో ఇంకా అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, మౌని రాయ్ వంటి భారీ తారాగణం ఉంది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని కథాంశం విషయానికి వస్తే ఇది ఓ సైన్స్ ఫిక్షన్ కథ. ఫాంటసీ థ్రిల్లర్ మూవీ. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ కథను మూడు భాగాలుగా అందించాలని చూస్తున్నారు. కాబట్టి దీన్ని పార్ట్ వన్ ఆఫ్ త్రీ ట్యాగ్ లైన్ తోనే పోస్టర్ డిజైన్ చేశారు. ఓటీటీ దిగ్గజ్జం డిస్నీ ఇండియా కూడా దీని నిర్మాణంలో తోడైంది కాబట్టి ఏ విషయంలోనూ రాజీ పడకుండా దీన్ని తెరకెక్కిస్తున్నారు.











