యష్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘కేజీఎఫ్ 2’. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ను ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. 2018లో విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో 100 కోట్ల మార్కును దాటిన మొదటి చిత్రంగా ‘కేజీఎఫ్’ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ 2’ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. విజయ్ కిర్గందురు నిర్మిస్తోన్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈరోజు రవీనా టండన్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. అందులో రమికా సేన్ పాత్రలో రవీనా చట్టసభలో కూర్చున్నట్లు ఉండగా, క్రూరత్వానికి అధినేత్రి అని దర్శకుడు ప్రశాంత్ ఈ లుక్ కి కామెంట్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రవీనా ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. దేశంలో విధించిన లాక్ డౌన్ వలన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. దాదాపు ఏడు నెలలు తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీలో యష్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, రవీనా టgడన్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్‌దత్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ‘కేజీఎఫ్ 2’ సినిమా లవర్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.