విజయవాడలో ఎప్పుడూ లేని రీతిలో వరదలు ముంచెత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. క్రిష్ణా నది ఒడ్డున విజయవాడ ఉన్నప్పటికీ, ఆ నది ఉప్పొంగడం వల్ల ఈ వరదలు రాలేదు. మరో కారణం ఉంది. కానీ, ఈ స్థాయిలో ఇళ్లలోకి, నడుములోతు నీళ్లు రావడం అనేది స్థానికులు ఎప్పుడూ చూడలేదు. అసలు విజయవాడను ఈ రేంజ్ లో వరదలు ముంచెత్తడానికి కారణం.. బుడమేరు కాలువ.
ఈ కాలువ ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో 170 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఖమ్మం నుండి వెలగలేరు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా బుడమేరు విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఆ సరస్సుకు నీళ్లందించే ప్రధాన నీటి వనరుల్లో ఈ బుడమేరు కాలువ ఒకటి. పశ్చిమ గోదావరి నుంచి వచ్చే తమ్మిలేరు, ఎర్ర కాల్వలతో పాటు బుడమేరు కూడా కొల్లేరులో కలిసి ప్రధాన నీటి వనరుగా ఉంది. విజయవాడ నగరం పక్క నుంచి ప్రవహించే కృష్ణా నది కన్నా కూడా నగరం మధ్యలో నుంచి ప్రవహించే బుడమేరు కాలువ నుంచే విజయవాడకు బాగా ముప్పు ఏర్పడింది.
సాధారణంగా బుడమేరు కాలువలో వర్షాకాలం రోజుల్లో గరిష్ఠ వరద ప్రవాహం 11 వేల క్యూసెక్కులుగా ఉంటుంది. అలా 2005 సంవత్సరంలో 70 వేల క్యూసెక్కులు ప్రవహించడంతో తొలిసారి విజయవాడలో వరదలు వచ్చాయి. దీంతో అప్పట్లో చెలరేగిన ఆందోళనల కారణంగా ఆపరేషన్ కొల్లేరు సరస్సును చేపట్టారు. బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకుంటే కృష్ణా జిల్లాకు శాశ్వత ముంపు పొంచి ఉంటుందని ఆందోళనలు జరిగాయి. దీంతో పొలవరం ప్రాజెక్టులో భాగంగా 2007 – 2008లో పోలవరం కుడి కాల్వలోకి బుడమేరు ప్రవాహాన్ని మళ్లించారు. అయితే ఈ నీరు కృష్ణా నదిలో చేరాలంటే కృష్ణా ఎగువ నుంచి వరద కొనసాగినప్పుడు అందులో ఈ జలాలు చేరే అవకాశం లేదు. బుడమేరును పోలవరం కుడికాల్వలో కలిపినా కూడా ఆ కాలువ గరిష్ట ప్రవాహం 37,500 క్యూసెక్కులు మాత్రమే. బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వలు ఏర్పాటు చేయలేదు.
2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు ఆ తర్వాత పట్టించుకోలేదు. పైగా బుడమేరు విజయవాడ పట్టణంలోకి రాకుండా నిర్మించిన కరకట్టను నాశనం చేస్తూ ఆక్రమణలతో నిర్మాణాలు జరిగాయి. తర్వాత తెలంగాణ, ఆంధ్రా విడిపోవడం.. విజయవాడ నగరంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడడం జరిగాయి. ఈ 20 ఏళ్లలో జరిగిన నిర్మాణాల కారణంగా కనీసం బుడమేరు కరకట్ట ఆనవాళ్లు కూడా ఇప్పుడు లేవు. దీంతో 20 నిర్లక్ష్యానికి ఫలితమే ఇప్పుడు విజయవాడకు వచ్చిన వరదలుగా చెబుతున్నారు. ఆనాడు సీఎం వైఎస్ బుడమేరు విషయంలో కఠినంగా వ్యవహరించి ఉన్నట్లయితే ఇప్పుడు ఇంత నష్టం జరిగి ఉండేది కాదని అంటున్నారు.