పులివెందుల కూడా తన చేజారకుండా ముందు జాగ్రత్తగా జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య తరచూ సొంత నియోజకవర్గ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం కూడా మూడు రోజుల పులివెందుల పర్యటనను జగన్ చేశారు. ఆ మూడు రోజులు పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. 2 రోజుల పాటు ప్రజలను, నాయకులను కలిశారు. ఆయన గత 3 పర్యటనల్లో వచ్చిన జనంలో ఈసారి సగం మంది కూడా రాలేదు. అది కూడా ఆ వచ్చిన వారు వైఎస్ భాస్కర రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి కుటుంబానికి సన్నిహితులే. కానీ పులివెందులకు చెందిన సామాన్య జనం మాత్రం మొహం చాటేశారు.
తన ఫ్యామిలీకి కంచుకోటగా భావించే పులివెందులలో తనను కలిసేందుకు స్థానిక ప్రజలు రాకపోవడం చూసి జగన్ విస్మయానికి గురయ్యారని తెలిసింది. అసలు శనివారం రాత్రి పులివెందులలో తన నివాసానికి చేరుకునే సమయానికి అక్కడ ప్రజలు ఎవరూ లేరు. ఆదివారం ఆయన ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనాలు వచ్చారు కానీ పులివెందుల నియోజకవర్గంలోని ప్రజలు లేరు. కేవలం వైఎస్ కుటుంబ పెద్దలకు సన్నిహితులు మాత్రమే అక్కడికి వచ్చారు.
అవినాశ్ రెడ్డి బాబాయి, మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి జగన్ వద్దకు వచ్చారు. ఆ సందర్భంలో ఓ ఐదారుగురు కౌన్సిలర్లు, చోటామోటా లీడర్లు ఆయన వెంట వచ్చారని తెలిసింది. వెంటనే జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నీకు వీళ్లు తప్ప ఇంకెవరూ లేరా? ప్రజలు ఎవరినీ పట్టించుకోవా అని ఆయన ముఖం మీదే అడిగినట్టు తెలిసింది. ఆదివారం రాత్రి ప్రజాదర్బార్ ముగిసిన తర్వాత ఇంట్లో తన సతీమణి భారతి, అవినాశ్‌రెడ్డి, మరో ఒకరిద్దరు నాయకులు కూర్చొని మాట్లాడుకుంటుండగా.. పులివెందులలో ఏం జరుగుతోందని జగన్ ఆరా తీసినట్లు తెలిసింది. తన గత 3 పర్యటనలలో కనిపించిన వారు కూడా రాలేదని, అసలు సామాన్య ప్రజలు ఎవరూ ఎందుకు రావడం లేదని జగన్ వాకబు చేశారు. నియోజకవర్గంలో ఉండి ఏం చేస్తున్నావన.. అవినాశ్‌రెడ్డిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఫ్రస్టేషన్‌తో తల బాదుకున్నారని కూడా సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఆగ్రహానికి గురైన ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటి నుంచి బయటికి రాగానే పక్కనే ఉన్న తన పీఏ చెంప పగలగొట్టినట్లుగా తెలిసింది.
జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన ఈ మూడు నెలల్లో పులివెందుల పర్యటనకు వెళ్లడం ఇది నాలుగోసారి. జగన్‌కు టీడీపీ నినాదం అయిన ‘వై నాట్ పులిందుల’ భయం పట్టుకున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఆయన తన సొంత నియోజకవర్గం మీద ఫోకస్ చేశారు. ఇటీవల పులివెందుల మున్సిపాలిటీపైన కూడా కూటమి సర్కారు కన్ను పడింది. దీంతో పార్టీ నాయకులు చేజారిపోతారని జగన్ భావిస్తున్నారు. అందుకే సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీని కాపాడుకోవాలని జగన్ అక్కడకు వెళ్లారని అంటున్నారు