కరోనా థర్డ్ వేవ్ వార్తలు సినీ జనుల గుండెల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సంక్రాంతి సినిమాల మీద చాలా మంది ఆశలు ఉన్నాయి. పైగా ఇవి పాన్ ఇండియా సినిమాలు కావడమే పెద్ద ఇబ్బందికరంగా మారింది.
ఓ పక్క కరోనా థర్డ్ వేవ్, ఇంకో పక్క ఓమెక్రాన్ కేసుల పెరుగుదల.. ఈ వార్తలు నిర్మాతల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. సినిమా విడుదల వాయిదా పడితే పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో తెలియదు. ఇప్పటికే చాలా తేదీలు మారుతూ వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అందరూ ఒక మాట అనుకుని ఆ ప్రకారం విడుదల తేదీలను ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ ల పరిస్థితి అంతుబట్టడం లేదు. వచ్చే ఏడాది జనవరి 7న ట్రిపుల్ ఆర్ విడుదలవుతోంది.
ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తారన్న వార్తలను ట్రిపుల్ ఆర్ టీమ్ ఖండించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకున్న తేదీనే సినిమాని విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. కానీ ఇతర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. అక్కడ కేసులు పెరిగిపోయి లాక్ డౌన్ లాంటిది పెట్టాల్సి వస్తే ఈ సినిమాల విడుదలకు ఇబ్బందే. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి పాన్ ఇండియా సినిమాలు కావడం వల్ల అనేక ప్రాంతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేయాల్సి వస్తోంది.
నిర్మాతలపై ఇప్పటికే వడ్డీల భారం పెరిగిపోయింది. నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది. మొదట్లో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని 11 వేల స్క్రిన్ ల మీద విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య 6వేల స్క్రీన్ లకు తగ్గిపోయింది. దానికి తోడు ఏపీలో టిక్కెట్ల ధర మీద మల్లగుల్లాలు సాగుతున్నాయి. ఈ ధరలతో సినిమాను విడుదల చేస్తే ఏ మాత్రం గిట్టుబాటు కాదనేది నిర్మాతల అభిప్రాయం. ఈ రెండు పెద్ద సినిమాల కారణంగా ఇతర సినిమాల విడుదలను కూడా వాయిదా వేశారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ విడుదల కూడా వాయిదా పడింది.
ఓటీటీ విడుదల తప్పదా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ విడుదల అనేది ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. కానీ పాన్ ఇండియా సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే ఏ మాత్రమూ గిట్టుబాటు కాదు. రాధేశ్యామ్ ను నేరుగా ఓటీటీలో విడుదల చేయవచ్చన్న వార్తలు వచ్చాయి. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా రూపొందుతోంది. విడుదల ఎన్నోసార్లు వాయిదా పడి చివరికి వచ్చే జనవరి 14 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కోవిడ్ థర్డ్ వేవ్ పుకార్త వల్ల నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి.
జీ5, నెట్ ఫ్లిక్స్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఆ సంస్థలు కూడా ఉత్సాహంతో ఉన్నాయి. మనకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారమైతే ఓటీటీ విడుదలకు మాత్రం నిర్మాతలు ఏమాత్రమూ సుముఖంగా లేరు. కాకపోతే నార్త్ ఇండియన్ లో థియేటర్ల పరిస్థితిపైనే ఆందోళన నెలకొంది. మహారాష్ట్ర, ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. అయినా విడుదల విషయంలో ఏమాత్రమూ వెనక్కి తగ్గరాదని నిర్ణయించుకున్నారు.
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. రాధేశ్యామ్ తో అతని స్టార్ డమ్ మరింత పెరగవచ్చని కూడా ఆశిస్తున్నారు. సినిమాను వారం రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించి ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చన్నది నిర్మాతల ఆలోచన. ట్రిపుల్ ఆర్ మాత్రం వెనక్కి తగ్గేలా లేదు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ధైర్యంతో ముందడుగు వేసేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ల ప్రచార దూకుడు మాత్రం ఆగలేదు.











