రిలయన్స్ కంపెనీ మరో సంస్థను టేక్ ఓవర్ చేసింది. కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్, వేర్‌హౌజింగ్ విభాగాలను ఆ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఆ ఒప్పందం విలువ రూ.24,713 కోట్లు. రిటైల్ వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించడంతోపాటు ఈ-కామర్స్ రంగంలో అమెజాన్ నుంచి ఎదురువుతున్న పోటీని తట్టుకునే ఉద్దేశంలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కొనుగోలు జరిపిందని కామర్స్ అసోసియేషన్ తెలిపింది. దేశీయ రిటైల్ రంగంలో సుస్థిరమైన స్థానం దక్కించుకున్న ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్, హోల్‌సేల్ విభాగాలను కొనుగోలు చేయడంతో ఈ రంగంపై మరింత దృష్టి సారించడానికి వీలు పడుతుందని ఆ సంస్థ రిటైల్ వెంచర్ లిమిటెడ్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు.
ఈ ఒప్పందంతో ఫ్యూచర్ గ్రూపునకు చెందిన బిగ్ బజార్, ఈజీ డే, బ్రాండ్ ఫ్యాక్టరీలు రిలయన్స్ వశం కానున్నాయి. ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌కు 1,800 స్టోర్లు ఉండగా దీనికి ప్యూచర్ గ్రూపునకు చెందిన మరో 1,700 స్టోర్లు జతవనున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా 3500 రిలయన్స్ స్టోర్లు వెలియనున్నాయి. కన్జ్యూమర్ ప్రొడక్టులు, ఫ్యాషన్ సోర్సింగ్, ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ విభాగాలు ఫ్యూచర్ గ్రూపు వద్దనే ఉండనున్నాయి. ఓ కంపెనీని మరో పెద్ద కంపెనీ టేక్ ఓవర్ చేయడం తప్పేమి కాదు. కానీ ఈ ఒప్పందం తీరుపై అనుమానం నెలకొంది. ఇంత మొత్తం ఒప్పందం జరిగితే మీడియా ఈ విషయాన్ని హైలైట్ చేయకపోవడం వైచిత్రం.
రిలయన్స్ చేతికి బిగ్ బజార్ అని ఓ వార్త కూడా ప్రధాన మీడియా పట్టించుకోకపోవడమేంటని సామాన్యులకు బుర్ర గోకున్నా అర్ధం కాకపోవచ్చు. మరి ఆర్థిక నిపుణులు, విపక్షాలు కూడా ఈ డీల్ పై సైలెంట్ గా ఉండటం మాత్రం అన్యాయమని చెప్పక తప్పదు. ఇండియాలో ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ ఉందని తెలుసా?. ఏదయినా రంగంలో ఏ ఒక్కరూ ఏకఛత్రాధిపత్యం చెలాయించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏర్పరిచిన సంస్థ. ఈ సంస్థ పలు ఒప్పందాలను సమీక్షంచడమే గాకుండా మోనోపోలీ లేకుండా చూస్తోంది. కానీ రిలయన్స్ లాంటి సంస్థల విషయంలో ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ చూసీచూడనట్లుగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మొబైల్ రంగంలో మోనోపోలీ దిశగా అడుగులు వేస్తున్న రిలయన్స్ సంస్థ ఈ-కామర్స్ వైపు ద్రుష్టి సారించింది. భవిష్యత్తులో ప్రతి రంగాన్ని ముకేశ్ నేతృత్వంలోని రిలయన్స్ సొంతం చేసుకున్నా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.