నూతన వ్యవసాయ చట్టం కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని, ఆ చట్టం అమలుచేస్తే రైతుల భవిత ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు చేపట్టిన ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. ఆంక్షలు, చలి, వర్షం.. వేటినీ లెక్కచేయకుండా రైతులు ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలకు దేశ వ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలు, రైతు అనుంబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. మరోవైపు ప్రభుత్వం రైతు సంఘాలతో జరుపుతున్న చర్చలు సఫలం కావడం లేదు.
పరిస్థితులు ఇలా ఉంటే.. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన ప్రకటన చేసింది. తాము రైతులనుంచి డైరెక్ట్ గా కొనుగోలుచేసే ఆలోచన లేదని, కార్పొరేట్ ఫార్మింగ్, కాంట్రాక్టు ఫార్మింగ్ చేపట్టే ఆలోచన లేదని, అందుకోసం వ్యవసాయ భూములు కొనుగోలు చేసే ఆలోచన లేదని, రానున్న కాలంలోనూ చేయబోమని ప్రకటించింది. తమకు వ్యవసాయ ఉత్పత్పులు సేకరించే సరఫరాదారులను కూడా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలుచేయాల్సిందిగా సూచిస్తామని, ఒత్తిడి చేస్తామని, దేశ రైతాంగానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించబోమని ప్రకటించింది.
దాడులతో.. గ్రూపునకు అప్రతిష్ట
రిలయన్స్ ప్రకటనకు నేపథ్యం కూడా ఉంది. మోదీ ప్రభుత్వ హయాంలో అంబానీ, అదానీల పేర్లు బాగా ప్రచారమయ్యాయి. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని విమర్శలూ వచ్చాయి. నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో.. క్షేత్ర స్థాయిలో రైతులకు దక్కుతున్న ధర ఎంత.. కార్పొరేట్ల స్టోర్లు, మాల్స్ లో సదరు ఉత్పత్తుల విక్రయ ధర ఎంత అని పోల్చి చూపే వీడియోలుకూడా సోషల్ మీడియాలో సర్య్యూలేట్ అయ్యాయి. మరోవైపు రిలయన్స్ కు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాల్లో రైతులు పిలుపునివ్వడంతో రిలయన్స్ ఉత్పత్తులపై ప్రభావం పడింది. పంజాబ్, హర్యానాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా రిలయన్స్ జియోకి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి.
పంజాబ్‌లో ఈమధ్య కొన్ని వారాలుగా రిలయన్స్ గ్రూపులో భాగమైన జియో టెలికం గేర్‌కి సంబంధించిన దాదాపు 1500 టవర్లపై దాడులు జరిగాయి. రిలయన్స్ ఫ్రెష్ దుకాణాలను ఆ రాష్ట్రాల్లో చాలాచోట్ల బంద్ చేయించాయి రైతు సంఘాలు. ఇక జియోనుంచి ఇతర మొబైల్ ఆపరేటర్లకు పోర్టబిటిలీలు ఆయా రాష్ట్రాల్లో పెరిగాయి. ఇవే విధానం కొనసాగితే రిలయన్స్ గ్రూపునకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం రూపు మార్చుకునే ప్రమాదం ఉండడంతో.. రిలయన్స్ గ్రూపు హైకోర్టును ఆశ్రయించింది. తమ ఆస్తులకు, ఉద్యోగులకు రక్షణ చర్యలు కల్పించేలా సహేతుక ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ దాడుల వెనక కొన్ని ప్రత్యేక శక్తులు, వ్యాపార శత్రువులు ఉన్నట్లు రిలయన్స్ ఆరోపించింది.
చర్చలకు ముందు రోజే..
ఇప్పటికే ఏడుసార్లు కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరిగినా సఫలం కాలేదు. రైతులకు అభ్యంతరాలు ఉన్న అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతుండగా అసలు నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దుచేయాలని రైతులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. రిలయన్స్ చేసిన ప్రకటనలో మిగతావన్నీ బాగానే ఉన్నా.. ఒకే అంశం అనుమానాలకు తావిస్తోంది. తాము డైరెక్ట్ గా రైతులనుంచి కొనబోమని, తమ సరఫరాదారుల నుంచి రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలుచేయాల్సిందిగా ఒత్తిడి చేస్తామని, తాము వ్యవసాయ భూములు కొనే ఆలోచన లేదని ప్రకటించింది. అయితే ఇక్కడే ఒక అంశం ప్రస్తావించాల్సి ఉంటుంది. చట్టాల్లో ఉన్న లోపాలను గుర్తు చేయాల్సి ఉంటుంది.
పేరుకే వేరే కంపెనీ..
ప్రస్తుతం దేశంలో నడుస్తున్న చాలా కంపెనీల్లో ఒక విధానం అమలవుతోంది. వేతనాలు ఎక్కువ ఇవ్వకుండా ఉండడం, సీనియార్టీతోపాటు కార్మిక చట్టాల నిబంధనలు తప్పించుకునేందుకు చాలా మంది యజమానులు వేరే కంపెనీలను నడిపిస్తుంటారు. కాగితాలపై యజమానుల పేర్లు వేరే ఉంటాయి. కాని ఒకే యాజమాన్యం కింద పనిచేస్తారు. కాగితాలపై వాటిని ఏజన్సీలుగా, థర్డ్ పార్టీ కంపెనీలుగా చూపించడం చాలాచోట్ల జరుగుతుంటుంది. ఈ విషయం అందరికీ తెలిసినా.. ‘నిబంధనలు’ అమలు అవుతున్నాయని చెప్పి ఏ చర్యలూ తీసుకునే అవకాశం ఉండదు. అది ఒకే రంగం అని చెప్పలేం. మీడియా కావచ్చు.. వైద్య సేవలు కావచ్చు.. సేవారంగం కావచ్చు.. ఉత్పత్తి రంగం కావచ్చు..చాలాచోట్ల ఇవి జరుగుతుంటాయి. ఇక రిలయన్స్ చేసిన ప్రకటనలో చెప్పిన ఆ ‘సరఫరా’దారు ఎవరనే అంశమే సందేహాలకు కారణం అవుతుంది.
అలాగని కార్పొరేట్లు ఆ రంగంలోకి రాకూడదని, వ్యాపారం చేయవద్దని చెప్పడం లేదని, బేషరతుగా రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తేనే.. వారి మాటలు నమ్మే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ సరఫరా దారుల జాబితాను ఎప్పటికప్పుడు కార్పొరేట్ల బయటపెట్టే అవకాశం ఉండదని, అది వ్యాపార రహస్యంగా చెబుతారని, అక్కడే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు రిలయన్స్ మాటలు నమ్మినా.. రానున్న కాలంలో సరఫరాదారు రిలయన్స్ గ్రూపు జేబులోని కంపెనీ అయి ఉండి, చట్ట ప్రకారం వేరే వ్యక్తులకు చెందినదిగా చూపిస్తే ఏమీ చేయలేమని, అందుకే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంమీద రిలయన్స్ ప్రకటన ఎంతవరకు రైతులను శాంతింపజేస్తుందని చూడాలి.