కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా, రైతుల పక్షాన పోరాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రాజీవ్ రైతు భరోసా దీక్షను రాజీవ్ రైతు భరోసా యాత్రగా మార్చిన రేవంత్ రెడ్డి.. ఆ పార్టీలోనే కొందరు నాయకులకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ఈ పాదయాత్ర సాగనుంది. ఒకరకంగా సొంత పార్టీలో అందరికంటే ముందుగా రాష్ట్ర వ్యాప్త సమస్యపై పోరాడే విషయంలో పాదయాత్ర చేపట్టిన వ్యక్తిగా నిలిచారు రేవంత్ రెడ్డి. రానున్న కాలంలో కాంగ్రెస్ శ్రేణుల నోటి వెంటే రేవంత్ పాదయాత్ర డిమాండ్ వచ్చేలా చేశారని చెప్పవచ్చు. ఇక ఈ పాదయాత్ర మొదలైన తీరుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే.. అది కూడా సంచలనమే అని చెప్పవచ్చు.
భరోసా దీక్షతో మొదలై..
అచ్చంపేటలో ఆదివారం ఉదయం 11 గంటలకు రాజీవ్ రైతు భరోసా దీక్ష మొదలైంది. సాయంత్రానికి భారీ బహిరంగ సభలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తొలుత ఈ ప్రస్తావన తెచ్చారు. రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే.. రాజీవ్ రైతు భరోసా దీక్షను రైతు భరోసా యాత్రగా మార్చాలని కోరారు. తరువాత మాట్లాడిన మరో సీనియర్ నేత మల్లు రవి కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో రేవంత్ మాట్లాడుతూ తమ సోదరి సీతక్క కోరిన ప్రకారం, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు సమస్యలపై పోరాటం చేస్తానని, రాజీవ్ రైతు భరోసా దీక్షను రైతు భరోసా యాత్రగా మార్చుతానని ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో అధిష్టానం అనుమతి వచ్చిందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

వ్యూహం మార్చిన రేవంత్..
రేవంత్‌రెడ్డి వర్గం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మొన్నటి వరకు ఢిల్లీలోనే ఉన్న రేవంత్ అక్కడి నుంచి పార్టీని గట్టెక్కించే విషయంలో గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాతే ఈ నిర్ణయ తీసుకున్నారని చెబుతున్నారు. ఇందుకు కొన్నాళ్ల క్రితం జరిగిన పరిణామాలను రేవంత్ వర్గీయులు తెరపైకి తెస్తున్నారు. ఆర్మూర్‌లో జరిగిన మొదటి దీక్షలో రేవంత్ హాజరయ్యారు. అయితే ఆ సభకు రేవంత్‌ని ఎవరు పిలవమని చెప్పారు..అసలు మీరు ఎందుకు రేవంత్‌ని ఫోకస్ చేస్తున్నారనే కోణంలో ఉత్తర తెలంగాణకు చెందిన, గతంలో హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న జిల్లా నుంచి ఎంపీ టిక్కెట్ ఆశించిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఫుల్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా, బీజేపీ సంచలనం రేపిన కేసీఆర్ ఇలాఖాలోని నియోజకవర్గం పరిధిలోనూ ఓ మహిళా లీడర్ పర్యటకు వెళ్లి ఆ నియోజకవర్గ నాయకుడు ఎవరి అనుమతితో వచ్చారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన వ్యూహాన్ని రేవంత్ మార్చినట్టు చెబుతున్నారు. గతంలో రేవంత్ నాయకులను కలుపుకోవడం లేదనే అభిప్రాయాన్ని పార్టీలోని కొందరు నాయకులు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా రేవంత్ పార్టీలోని తన సన్నిహితుల వద్ద మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉన్నానని, డబుల్ గేమ్ ఆడే నాయకులకు తన వ్యూహం చెబితే..కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా పార్టీకి కూడా నష్టం వస్తుందని చెప్పినట్టు సమాచారం. అందుకే ఆర్మూర్ దీక్షకు కూడా రేవంత్‌రెడ్డి డైరెక్ట్‌గా ఢిల్లీ నుంచే వచ్చినట్టు సమాచారం. దీక్ష ముగిశాక మళ్లీ ఢిల్లీ వెళ్లి..పార్టీలోని ముఖ్య నాయకులతో మాట్లాడి విషయాన్ని వివరించినట్లు తెలుస్తోంది. పార్టీని గట్టెక్కించేందుకు మీ ప్రయత్నం మీరు చేయండి..మేం అండగా ఉంటాం..అన్నీ గమనిస్తున్నాం అని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అచ్చంపేట సభలో పాద యాత్రపై ఫోన్ ద్వారా అధిష్టానానికి సమాచారం ఇచ్చి..వెంటనే నిర్ణయం ప్రకటించినట్టు చెబుతున్నారు.
ఉదయం మళ్లీ ఫోన్..
సోమవారం రెండోరోజు పాదయాత్ర ప్రారంభమైన కాసేపటికే రేవంత్‌కి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో ఆ ఫోన్ మాట్లాడిన విజువల్స్ కూడా గమనించవచ్చు. పాదయాత్ర మొదలైందని, స్పందనపై వివరించినట్టు తెలుస్తోంది. ఇక పాదయాత్రలో రేవంత్‌రెడ్డి కేవలం రైతు సమస్యలపైనే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ విధానాలపై మాట్లాడుతున్నారు. మొత్తం మీద రానున్నకాలంలో రేవంత్ పాదయాత్ర ప్రకంపనలు కాంగ్రెస్‌లో ఎలా ఉంటాయనేది తేలాల్సి ఉంది. కాగా రేవంత్ పాదయాత్రపై కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్య నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా పోటీదారులు మాత్రం ఒకటి రెండు రోజుల్లో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
Also Read: రేవంత్ స్కెచ్‌కు.. కల్వకుంట్ల కవిత వర్గంలో హ్యాపీ











