శత్రువుకు శత్రువు మిత్రుడే.. కొన్నిసార్లు రాజకీయ నాయకులకు కూడా ఇది కలసి వస్తుంది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు రాజకీయంగా బలహీనమయ్యే ఏ అవకాశమైనా ఇతర పార్టీల వారికి కలసి వస్తుందని చెప్పవచ్చు. సరిగ్గా ఇప్పుడు నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ , కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో పసుపు పంటకు మద్దతు ధర, పసుపు బోర్డు కోసం రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా ఒకరోజు దీక్ష చేపట్టారు. భారీ సంఖ్యలో రైతులు ఈ సభకు వచ్చారు. ఈ సభలో అటు టీఆర్ఎస్‌ను, ఇటు బీజేపీని ముఖ్యంగా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై విమర్శలు గుప్పించారు. సభ సక్సెస్ అయింది కాని ఫలితం ఎవరకు, ఎంత మేరకు ఉంటుందనే చర్చ మొదలైంది.
కల్వకుంట్ల కవిత ఓటమితో..
2014లో పసుపు బోర్డు ఏర్పాటు, నిజాం చెక్కెర కర్మాగారం (బోధన్)ని తెరిపించే హామీలు ఇచ్చిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఓటమికి పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడం ప్రధాన కారణంగా చెబుతారు. అందులో భాగంగానే 178 మంది రైతులు నామినేషన్ వేశారు. మిగతా 7మంది వివిధ పార్టీలకు చెందినవారు ఉన్నారు. ఆ ఎన్నికల్లో మొత్తం 185మంది బరిలో నిలిచారు. ఇంతమంది రైతులు నామినేషన్లు వేయడం వెనుక కేవలం పసుపు బోర్డే కాదని, రకరకాల కారణాలున్నాయన్న ఆరోపణలున్నా.. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ గెలుపొందారు. ఏకంగా సీఎం కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవిత ఓడిపోవడం సంచలనం రేపింది. అప్పటి నుంచి అర్వింద్ వర్సెస్ టీఆర్ఎస్ పోరు నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి పసుపు బోర్డు కోసం ఆందోళనకు రావడం, ఒకరకంగా చెప్పాంటే ఆందోళన సక్సెస్ కావడం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో పోరు మొదలైందని చెప్పవచ్చు. అదే సమయంలో కల్వకుంట్ల కవితకు సానుభూతి పెరిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
కేడర్ ఉన్నా..లీడర్లే..
ఈ లోక్‌సభ పరిధిలో ఉండే ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకత్వం కొన్ని చోట్ల మాత్రమే ప్రస్తుతం బలంగా ఉంది. జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇక ఆర్మూర్‌లో అధికార పార్టీ గెలవగా కాంగ్రెస్ నుంచి 2014లో పోటీ చేసిన సురేష్‌రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరారు. అక్కడ ఆకుల లలిత కాంగ్రెస్ లీడర్‌గా ఉన్నారు. బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ టీఆర్ఎస్ పార్టీ కాగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ నేతగా ఉన్నా.. వయస్సు రీత్యా కొంత వెనుకబాటు కనిపిస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలో ముఖ్య నాయకుడైన మధుయాష్కీ ఉన్నా లోక్‌సభ పరిధి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే అవకాశాలు తక్కువగా ఉండడం ప్రతిబంధకంగా మారింది. ఇక ఎంపీగా అర్వింద్ ఉండడం, నిజామాబాద్‌లో బీజేపీ కేడర్ బలంగా ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు కాగా, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కావడంతో అధికార పార్టీ కార్యకలాపాలూ వేగంగానే ఉంటున్నాయి. ఎటొచ్చీ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
Must Read ;- జాతీయ రహదారిని దిగ్భంధించిన నిజామాబాద్ ‘పసుపు’ రైతు!
వ్యూహం ఇలా..
పసుపు బోర్డు తేనందుకు కవితను ఓడించారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి గెలిచిన అర్వింద్ కూడా మాట తప్పారని టీఆర్ఎస్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ఉందని, ఎంపీగా కవితని గెలిపించి ఉంటే.. చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవని ఇప్పటికే సానుభూతి కోణంలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం మొదలు పెట్టాయి. అంతేకాకుండా.. పసుపు బోర్డు తేలేదని ఎంపీ అర్వింద్‌ను టీఆర్ఎస్ నుంచి ఎవరైనా ప్రశ్నించిన సందర్భంలో అర్వింద్ వరుస కామెంట్లతో పరువు తీసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టీఆర్ఎస్ నుంచి భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు. ఇక ఇటీవలి కాలంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీపై దూకుడు తగ్గించినట్లు చర్చ నడుస్తోంది. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీనిపై ఎంపీ అర్వింద్ ఎలాగూ కౌంటర్ ఇస్తారు. పంచ్‌లు విసురుతారు. ధర్మపురి అర్వింద్ చేస్తున్న కామెంట్లు తొలినాళ్లలో బీజేపీలో జోష్ నింపినా..క్రమేణా ప్రజల్లో నెగెటీవ్ అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మన లీడర్, మన ప్రభుత్వం, మన కవిత అని ప్రచారం మొదలు పెట్టింది టీఆర్ఎస్. పసుపు బోర్డు విషయంలో కాంగ్రెస్ చేసిన దీక్ష, ఆందోళన విషయంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. బీజేపీని, అర్వింద్‌ను, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసింది. కాని.. అర్వింద్‌పై వ్యతిరేకతను కవిత పట్ల సానుభూతిగా మార్చేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాయి.
ప్రాంతీయ కార్యాలయం వర్సెస్ పసుపు బోర్డు..
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై హామీ ఇచ్చారు. ఇది నియోజకవర్గంలో చాలా ప్రభావం చూపింది. అయితే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటైంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పైసెస్ బోర్డు డివిజన్ కార్యాలయాన్ని రీజనల్ హోదా కార్యాలయంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డు తరహాలో ప్రయోజనాలు ఉంటాయని, అంతకంటే మంచిది తెచ్చానని ధర్మపురి అర్వింద్‌తో పాటు బీజేపీ నాయకులు చెబుతున్నారు. కాగా 2010లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, సిక్కిం, గువాహటి, గుజరాత్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం గుంటూరు, వరంగల్‌లో ప్రాంతీయ కార్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేసిందని, 16 జోనల్, 13 మార్కెటింగ్ కార్యాలయాలున్నాయని, ప్రత్యేకంగా పసుపు రైతులకు చేసిన మేలు ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి గెలిచిన ధర్మపురి అర్వింద్ మాట తప్పారని కొన్ని రైతు సంఘాలు, వైరి పక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్వింద్‌పై వచ్చే ప్రతి ప్రతికూల అంశాన్ని టీఆర్ఎస్ తనకు సానుకూలంగా మార్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read ;- అర్వింద్ బాల్య వితంతువుగా మారుతావా?: రేవంత్