వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని కేసులు నమోదు అయ్యి అప్పుడే 15 ఏళ్లు కావస్తోంది. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా… తండ్రి అదికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అందిన కాడిని దండుకున్నారంటూ… నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు చేసిన ఫిర్యాదుతోనే ఈ కేసు నమోదు అయ్యింది. నేరుగా హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీబీఐ… జగన్ ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈడీ జగన్ పై కేసులు నమోదు చేసింది. 16 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన జగన్… ఆ తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు.2019 ఎన్నికల్లో బెయిల్ ఉండే ఏపీకి సీఎం అయ్యారు. ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ జగన్ పార్టీ తరఫుననే ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం వైసీపీని వీడిన రఘురామ.. టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నారు.
రఘురామ వేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ లో రఘురామ ఏమంటారంటే… జగన్ కేసుల విచారణలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. జగన్ తో సీబీఐ కుమ్మక్కు అయ్యిందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ కేసు విచారణ ఎన్ని సార్లు వాయిదా పడుతున్నా కూడా సీబీఐ అభ్యంతరం చెప్పడం లేదన్నది ఆయన వాదన. నిజమే మరి… తాను నమోదు చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి కేసును ఎప్పటికప్పుడు వాయిదా పడేలా చేస్తూ ఉంటే..ఓ విచారణ సంస్థగా దానిని సీబీఐ అడ్డుకోవాలి కదా. సీబీఐ అడ్డుకోలేదంటే… జగన్ తో కుమ్మక్కు అయినట్టే కదా. ఈ లెక్కన రఘురామ ఆరోపణ నిజమే కదా. ఇదే వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రఘురామ తరఫు న్యాయవాది వినిపించారు. అసలు ఈ కేసు విచారణను ఎన్నిసార్లు వాయిదా వేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో ఇప్పటికే ఐదుగురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారని ఆయన గుర్తు చేశారు.
ఒకసారి న్యాయమూర్తి బదిలీ అయితే ఏమోలే అనుకోవచ్చు… రెండో సారి కూడా జడ్జి బదిలీ అయితే కాకతాళీయమే అనుకోవచ్చు.. అదే మూడోసారి కూడా న్యాయమూర్తి బదిలీ అయితే కుట్ర కోణం ఉందనే అనుమానించాలి అంటూ రఘురామ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎప్పటికప్పుడు ఈ కేసు విచారణ వాయిదా పడేలా జగన్ వ్యూహాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ వ్యూహాలు తెలిసి సీబీఐ కోర్టుల్లో నోరు మెదపడం లేదని ఆయన ఆరోపించారు. ఈ లెక్కన జగన్ తో సీబీఐ కుమ్మక్కు అయినట్టేనని నిరూపితమైనట్లే కదా అని వాదించారు. ఈ కారణంగా ఈ కేసు సత్వర ముగింపునకు కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరారు. అప్పుడే ఈ కేసులో నిందితులకు సకాలంలో శిక్ష పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సీబీఐ అభ్యర్థనతో సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఆ వాయిదా సందర్భంగా అయినా కోర్టు రఘురామ వాదనను ఎలా పరిగణిస్తుందో చూడాలి.