బాలీవుడ్ లో మరో బాంబు లాంటి వార్త పేలింది. బాలీవుడ్ లో మిస్టర్ ఫర్‌ఫెక్షనిస్ట్ గా పేరు సంపాదించుకున్న ఆమిర్ ఖాన్… తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు ఆమిర్ దంపతులు ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై తామిద్దరం భార్యభర్తలం కాదని, తాము విడాకులు తీసుకున్నామని ఆ ప్రకటనలో వారు సంచలన ప్రకటన చేశారు. ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది.
నటుడిగా మంచి గుర్తింపు
బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆమిర్.. పలు హిట్ చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఆమిర్ మంచి హిట్స్ నే అందుకున్నాడు. ఇటీవలి కాలంలో విభిన్న కథాంశాలను ఎన్నుకుంటున్న ఆమిర్ దేశవ్యాప్తంగా తన సినిమాలపై ఆసక్తి రేకెత్తిస్తున్నారు. 2001లొ విడుదలైన లగాన్ మొదలు.. మంగళ్ పాండే, పీకే, దంగల్ వంటి చిత్రాలతో ఆమిర్ కు దేశవ్యాప్తంగా తిరుగులేని అప్లాజ్ వచ్చింది.
రెండో పెళ్లీ పెటాకులే!
చాలా కాలంక్రితమే తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న ఆమిర్… లగాన్ చిత్రం షూటింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావుతో ప్రేమలో పడిపోయాడు. 2005లో కిరణ్ ను పెళ్లి చేసుకున్న ఆమిర్ సుదీర్ఘ కాలం పాటు హాయిగానే గడిపారు. అయితే ఏమైందో తెలియదు గానీ… ఉన్నట్టుండి తాము విడాకులు తీసుకుంటున్నామంటూ ఆమిర్, కిరణ్ లు ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. ఆమిర్ కు మొత్తంగా ముగ్గురు పిల్లలున్నారు. మొదటి భార్య రీనా ద్వారా ఇద్దరు ఉండగా.. రెండో భార్య కిరణ్ ద్వారా మరో కుమారుడు ఉన్నాడు.