ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ తలుపులు బద్దలుకొట్టి అందులోకి తెలంగాణలోని ప్రతి బిడ్డకు ప్రవేశం కల్పిస్తామనని ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న గంట ముందే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెలను బుల్డ్రోజర్ తో నెట్టించి.. తాను అన్నమాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాక ప్రగతి భవన్ పేరు మార్చి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ గా నామకరణం చేశారు. ఇక నుంచి ఇక్కడ అందరికీ ప్రవేశం ఉంటుందని.., ప్రజా సమస్యలపై నిత్యం ప్రజా దర్బర్ నిర్వహిస్తామని ప్రమాణస్వీకారం వేదికపై నుంచి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు మాట ఇచ్చినట్లుగా ప్రగతి భవన్ కంచెలను తొలగించి.. రాష్ట్రంలోని అందరికీ ప్రవేశం ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
పదేళ్ళుగా ముఖ్యమంత్రి అధికార నివాసం.., కార్యాలయం, జనహిత బ్లాక్స్ తో ఉన్న ప్రగతి భవన్ దాదాపు రూ. 38 కోట్లతో 2016 లో పున:నిర్మించారు. ఆనాటి నుంచి మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నివాసం ఉన్నారు. నివాసం, అధికార కార్యాలయం, జనహిత సమావేశ మందిరాలు ఉన్నా ప్రగతి భవన్ లోకి ఏనాడు సామాన్యులకు ప్రవేశం లేదన్నది వాస్తవం. 9 ఎకరాల్లో ఉన్న ప్రగతి భవన్.. కేవలం ముఖ్యమంత్రి అధికార నివాసానికే పరిమితమైంది. అందులోకి కోట్లాడి తెలంగాణకు సాధించిన అమరవీరులకు.., సామాన్యులకు ప్రవేశాన్ని ఆనాడే నిషేదించారు. నియోక్లాసికల్, పల్లాడియన్ శైలిలో గుడ్ అర్కిటెక్ నైపుణ్యంతో నిర్మించిన ప్రగతి భవనం చూసేందుకు బ్రిటీషు రెసిడెన్సీ, ఫలక్ నుమా ప్యాలెస్ మాదిరిగా ఉంటుంది. కానీ.., అసలు ప్రగతి భవన్ ఎలా ఉంటుందో నేటికీ తెలంగాణ బిడ్డలు చూసేందుకు అవకాశం లేకపోవడం విశేషం.
కానీ.., ఆ పరిస్ధితి నేటి నుంచి మారనున్నది. పంజాగుట్టలో ఉన్న ప్రగతి భవన్ నేడు ప్రజా భవనం అయ్యింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ లోకి అందరికీ ప్రవేశం కల్పిస్తూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు.., రాష్ట్రాభివృద్ధికి తగు సూచనలు ఇచ్చేందుకు ప్రజా భవన్ లోకి అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.











