ఆ మాజీ ఉపముఖ్యమంత్రిలో పదవి పోతూనే వైరాగ్యం అలుముకుందా ? జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇచ్చినా అందరినీ కలుపుకుపోలేకపోతున్నారా ? పదవి ఉన్నప్పుడు తన హవా చూపించిన ఆ మహిళా నేత నేడు కోటకే పరిమితమవడం వెనుక కారణాలు ఏమిటి ? వైసీపీకి కంచుకోటగా ఉన్న ఆ ప్రాంతంలో వర్గ విబేధాలు పార్టీ కొంప ముంచుతున్నాయా ? ఇంతకీ రీవెంజ్ పాలిటిక్స్ కి కేరాఫ్ గా మారిన ఆ జిల్లా ఏది ? కొత్తగా పావులు కదుపుతున్న ఆ నాయకులు ఎవరు ?
మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం జగన్ నామ స్మరణతో గడిపిన ఆ మాజీ డిప్యూటీ సిఎం పదవి పొగానే సైలెంట్ అయిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని ఇతర నాయకులను పట్టించుకోకుండా తాను చెప్పింది జరగాల్సిందే అనేలా వ్యవహరించిన ఆమెకు ఇప్పుడు అవే పరిస్థితులు ఎదురవుతున్నాయట.జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా సొంత పార్టీ నేతల నుంచే సహకారం లభించకపోవడంతో ఆమె తన కోటకే పరిమితమవుతున్నారట.దీంతో కొత్తగా ఏర్పడిన ఆ జిల్లాలో రీవెంజ్ పాలటిక్స్ కు తెరలేచాయనే చర్చ జోరందుకుంది.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పుష్ప శ్రీవాణికి పదవి పోయింది. ఆమె స్థానంలో జిల్లా నుంచి రాజన్నదొరకు జగన్ క్యాబినెట్ లో బెర్త్ లభించింది.అయితే అప్పటి వరకు మంత్రిగా ఉన్న శ్రీవాణికి ఈ అంశం అస్సలు రుచించలేదట.మంత్రి పదవి కోల్పోయిన పుష్ప శ్రీవాణిలో అసంతృప్తి తీవ్రంగా నెలకొందట. ఇక జిల్లా పార్టీ అధ్యక్షురాలి బాధ్యయతలు అప్పజెప్పినా మంత్రి పదవి పోయిందనే కారణంగా ఆమె పెద్దగా పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదట. తన కోటకే పరిమితమై తన పనేంటో తాను చూసుకుంటున్నారట ఆమె.
జిల్లాల పునర్విభజనతో కొత్తగా ఏర్పడిన పార్వతీపురం జిల్లాలో అధికార వైసీపీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. నిన్నటి వరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్ప శ్రీవాణికి జిల్లాలోని ఇతర నాయకులకు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరే దీనికి కారణమని టాక్. దీంతో వైసీపీకి కంచుకోటగా చెప్పుకుంటున్న విజయనగరం ఏజెన్సీలో ఆ పార్టీకి ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయట.అయితే దీనికి పుష్ప శ్రీవాణి వ్యవహారమే కారణమనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
నిజానికి పుష్ప శ్రీవాణికి మొదటి నుంచి జిల్లా నేతలతో పెద్దగా పోసిగేది కాదట.ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా ఆరుగురు ఎమ్మెల్యేలు జిల్లాకు చెందిన మరో మంత్రి బొత్సతోనే ఉండేవారట. దీంతో శ్రీవాణి ఒంటరిగానే రాజకీయం చేసుకునే వారని టాక్. ఇక మంత్రి పదవి నుంచి పుష్ప శ్రీవాణిని తప్పించిన వైసీపీ అధిష్టానం ఆమెకు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పజెప్పింది. అయితే ఆ తర్వాత కూడా శ్రీవాణి వ్యవహారంలో మార్పు రాలేదట. నాలుగు నియోజకవర్గాలతో ఏర్పడిన పార్వతీపురం జిల్లాలో కూడా మిగిలిన వారితో ఆమెకు పెద్దగా సయోధ్య కుదరడం లేదట. దానికి ఆమె వ్యవహరిస్తున్న తీరే కారణమని సొంత పార్టీ నేతలె చర్చించుకుంటున్నారు.
జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీవాణి జిల్లా కేంద్రంలో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలతో నగరాన్ని ముంచేశారు ఆమె వర్గీయులు. అయితే పుష్ప శ్రీవాణి ఫ్లెక్సీలలో మంత్రుల ఫోటోలు లేవత. ఇదంతా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే ఆమె ఇలా చేశారని వైసీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారట.
ప్రధానంగా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకి పుష్ప శ్రీవాణికి మధ్య మొదటి నుంచే కోల్డ్ వార్ నడుస్తూ వస్తోంది.అందుకే ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవాణి తమను అస్సలు పట్టించుకోలేదని జోగారావు వర్గీయులు బహిరంగంగానే చర్చించుకునేవారట.అందుకే ఇటీవల జోగారావు నిర్వహించిన పార్టీ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జిల్లా అధ్యక్షురాలు శ్రీవాణి ఫోటోలను పెట్టలేదట. మీటింగ్ లో కూడా దూరాన్ని పాటించారట. దీంతో పుష్ప శ్రీవాణి వర్సెస్ జోగారావు మధ్య ఆధిపత్య పోరు తొలగలేదని క్యాడర్ కి కూడా అర్ధమయ్యిందట.
ఇక ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకి, పాలకొండ ఎమ్మెల్యే కళావతికి, ఎమ్మెల్సీ విక్రాంత్ లకి కూడా శ్రీవాణితో అంతా చక్కటి సంబంధాలు లేవట. వారు కూడా తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తి వయకం చేసిన సంధర్భాలు ఉన్నాయట. ఇదే అంశాన్ని పార్టీ సమావేశం వేదికగా బాహాటంగానే బయట పెట్టేశారట.ఇక రాజన్నదొర సైతం శ్రీవాణికి అస్సలు సహకరించడం లేదట. దీనికి గతంలో ఆమె వ్యవహరించిన తీరే కారణమని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గతంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజన్నదొరను శ్రీవాణి తీవ్రంగా అవమానించారట. అందుకే ఇప్పుడు ఆయన అంతకు అంత బదులు తీర్చుకుంటున్నారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీంతో మన్యం జిల్లాలో అధికార వైసీపీలో రాజకీయం రివేంజ్ పాలిటిక్స్ రూపంలో బుసలు కొడుతున్నాయని చర్చ జోరుగా సాగుతోంది.
మొత్తం మీద కొత్తగా ఏర్పడిన జిల్లాలో బుసలు కొడుతున్న వర్గపోరు సర్దుకుంటుందా..ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏమిటి ? అసలు ఈ రివేంజ్ పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది వేచి చూడాలి..