రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం పై ఎన్.సి.పి అధినేత శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల రేసులో విపక్షాల అభ్యర్ధిగా శరద్ పవర్ నిలుస్తున్నారనే వార్తలో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి.. ఈ నేపధ్యంలో దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనంటూ ఆయన కుండబడ్డలు కొట్టేశారు. ముంబైలో ఎన్సీపీ నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయం పై పూర్తి స్పష్టతను ఇచ్చారు.
భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. రాష్ట్రపతి పదవి కోసం ఎవరెవరు బరిలోకి దిగొచ్చనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్ది అంశంలో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తూ పెద్ద చర్చే జరుగుతోంది.
ముఖ్యంగా విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ పవార్ ముందు ఉంచింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునేంత ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ప్రతిపక్షాలకు లేకపోవడంతో.. ఎన్నికల్లో పోటీ చేయడానికి పవార్ ఆసక్తిని చూపించడం లేదని చెపుతున్నారు. జులై 24న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియబోతోంది. ఈ లోగానే కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.