నిండా 40 సంవత్సరాలు కూడా లేవు.. వ్యాపార రంగంలో ఉన్నత స్థానాలను అందుకుంటూ…సంపన్నులుగా మారిన భారతీయ యువ వ్యాపారవేత్తల జాబితాలో విజయవాడ కుర్రాడు స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాను ఐఐ ఎఫ్ ఎల్ వెల్త్-హురున్ ఇండియా విడుదల చేసింది. ‘ఐఐ ఎఫ్ ఎల్ వెల్త్ హురున్ ఇండియా 40- అండర్ సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020’ పేరుతో ఈ జాబితాను వెల్లడించింది. ఇందులో విజయవాడకు చెందిన శ్రీ హర్ష మాజేటి రూ.1.400 కోట్ల సంపదతో 15 వ స్థానంలో నిలిచారు. ఈయన బుందిల్ టెక్నాలజీస్ అనే సంస్థ సహ వ్యవస్థాపకుడు కూడా. ఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీ బుందిల్ టెక్నాలజీస్ నుంచి పుట్టిందే.
స్విగ్గీకి టాన్సెంట్ హొల్డింగ్స్ నాస్పెర్స్ లిమిటెడ్, డీఎస్టీ గ్లోబల్ వంటి సంస్థలు దీనికి పెట్టుబడి పెట్టి సహకరించిన విషయం తెలిసిందే. హర్ష గత ఏడాది కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఏడాది కూడా ఆయన సంపాదన అదే స్థాయిలో ఉన్నట్లు ఐఐ ఎఫ్ ఎల్ వెల్త్ – హురున్ ఇండియా పేర్కొంది. జెరోథా స్టాక్ బ్రోకింగ్ వ్యవస్థాపకులు నితిన్ కామత్, నిఖిల్ కామత్ లకు ఈ జాబితాలో అగ్ర స్థానం దక్కింది. మీడియా.నెట్ కు చెందిన దివ్యాంక్ తురఖియా రెండో స్థానంలో నిలిచారు. ఉడాన్ కు చెందిన ఆమోద్ మాల్వీయా మూడో స్థానంలో ఉండగా… ఫ్లిప్ కార్ట్, థింక్ అండ్ లెర్న్, ఏఎన్ఐ టెక్నాలజీస్, జొమాటో ఇండియా, వీయూ టెక్నాలజీస్ తదితర సంస్థల వ్యవస్థాపకులు ఈ లిస్ట్ లో ఉన్నారు.
జాబితాలో ఏకైక మహిళ
ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక మహిళ 39 ఏళ్ల దేవితా రాజ్ కుమార్. టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు విక్రయించే వీయూ టెక్నాలజీస్ ను ఆమె 2006లో ప్రారంభించారు. రూ.1,200 కోట్ల సంపదతో ఆమె 16వ స్థానంలో నిలిచారు.











