వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి.. పార్టీని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా చికాకు పెడుతున్న ఎంపీ రఘురామక్రిష్ణ రాజు తీరు అందరికీ తెలిసిందే. అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పేరు ప్రచారంలో పెట్టుకోవడానికే చెక్ పెట్టేలా.. ఆయన చికాకు పెట్టారు కూడా. ఆ పేరు చెప్పుకోవడమే తప్పంటూ ఆయన కొత్త వాదన కూడా లేవనెత్తారు. ప్రభుత్వం తీరు మీద, పరిపాలన మీద, మంత్రులు, ఎమ్మెల్యేల మీద అనేక రకాల ఆరోపణలు చేశారు.
వీటితో విసిగిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్.. రఘురామక్రిష్ణ రాజుపై చర్యలకు ఉపక్రమించింది. ఏకంగా ఆయన పార్లమెంటు సభ్యత్వానికే చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. పార్టీ తరఫున స్పీకరుకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా పదవినుంచి కూడా ఆయనను తొలగించాలని పార్టీ స్పీకరును కోరింది.
ఈలోగా రఘురామక్రిష్ణ రాజు.. కొత్త వ్యూహం అనుసరించారు. భాజపాతో సన్నిహితంగా మెలగుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తొందర్లోనే ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు ప్రజలు అనుకునే వాతావరణం ఆయన సృష్టించారు. స్పీకరుకు విన్నపాలు చేసుకుని, తనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రత మీద నమ్మకం లేదని అంటూ.. ఆ మేరకు ఆయన కేంద్రం నుంచి వై కేటగిరీ భద్రత పొందగలిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విన్నపాల్ని పక్కన పెట్టి, తనకు స్పీకరు ప్రాధాన్యం ఇస్తున్నదన్న భావన కలిగించగలిగారు.
ఈలోగా.. పార్టీ మీద ముఖ్యమంత్రి మీద చాలా తీవ్రమైన పదజాలంతో కూడా ఆర్ఆర్ఆర్ కామెంట్లు చేయడం జరిగింది.
అయితే తాజాగా ట్విస్టు వచ్చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవినుంచి రఘురామక్రిష్ణ రాజును తొలగిస్తూ స్పీకరు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ వారికి ఇది శుభవార్తే. ఆయన ఎంతగా బీజేపీ ఆశీస్సులు ఉన్న నేతగా బిల్డప్ ఇవ్వదలచుకున్నప్పటికీ.. వైసీపీ తలచిందే జరిగింది.
ఈ నిర్ణయం జగన్‌కు పూర్తి ఊరట అవుతుందా?
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ హోదా పోయినంత మాత్రాన.. ఆర్ఆర్ఆర్, వైసీపీని చికాకు పెట్టడం ఆగే వ్యవహారం కాదు. నిజానికి ఆయన ఎంపీ పదవిని కూడా ఊడగొట్టాలనేది పార్టీ కోరిక. ఆ విజ్ఞప్తి స్పీకరు వద్ద ఇప్పటికీ అలాగే పెండింగులో ఉంది. దానిని వారు మన్నిస్తారనే గ్యారంటీ కూడా లేదు.
స్పీకరు మధ్యేమార్గంగా వ్యవహరించారా? అనే అనుమానం కూడా పలువురిలో కలుగుతోంది. ఈ స్టాండింగ్ కమిటీ పదవినుంచి తొలగించి.. వైసీపీకి ఊరట ఇచ్చినట్లే కనిపిస్తూ.. ఎంపీ పదవి నుంచి తొలగించడాన్ని పక్కన పెట్టేస్తారేమో అనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఎంపీ పదవి పోనంత వరకు ఆర్ఆర్ఆర్ తిరుగుబాటు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ, జగన్మోహన్ రెడ్డి గానీ పూర్తి విజయం సాధించినట్టు అనిపించుకోదు. మరి ఏంజరుగుతుందో చూడాలి.











