మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాని విడుదలకి రెడీ చేసేశాడు. నిజానికి లాక్ డౌన్ లేకపోతే మే1నే ఈ సినిమాని విడుదలచేయాలని నిర్మాతలు భావించారు. కానీ కోవిడ్ 19 వారి ప్లాన్స్ అన్నిటినీ అప్ సెట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాని జీ ప్లెక్స్ లో పే ఫర్ వ్యూ పద్ధతిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా మేనల్లుడి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతడికి ఆరోగ్యం ఏమంతగా బాగోలేదని, ఇంట్లోంచి బైటికి రాకుండా.. జాగ్రత్త పడుతున్నాడని వార్తలొస్తున్నాయి. అయితే అతడికి ఏ సమస్యో తెలియడం లేదు కానీ.. ఈ కరోనా టైమ్ లో ఆ విషయం గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. మొత్తానికి ఆయన బైటికి రావడం లేదనే వార్త బలంగా వినిపిస్తోంది.
దీని కారణంగా ‘సో బ్రతుకే సో బెటర్’ కి సంబంధించిన.. సాయితేజ డబ్బింగ్ పార్ట్ పెండింగ్ లో పడిందని తెలుస్తోంది. నిజానికి అక్టోబర్ 1కే ఈ సినిమా ఫస్ట్ కాపీ విడుదలవ్వాలి. కానీ ఆ వర్క్ ఇప్పటికీ పెండింగ్ లో పడడంతో .. జీ ప్లెక్స్ వారి నుంచి నిర్మాతలకు చాలా ప్రెజర్ వస్తోందని చెప్పుకుంటున్నారు. అందుకే అసలు విషయం ఏంటో వారికి వివరించే పనిలో నిర్మాతలు ఉన్నారని వినికిడి. నిన్నటికి నిన్న సాయిధరమ్ తేజ తన మ్యారేజ్ మేటర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చాడు. అంతలోనే ఇప్పుడు అతడి ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది.











