(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
విజయవాడలో స్వరాజ్ మైదానం తెలియని వారుండరు. నగరం నడిబొడ్డున 20 ఎకరాల సువిశాల మైదానం. మహాత్మాగాంధీ స్వాతంత్ర ఉద్యమ ప్రసంగాలు ఇచ్చిన మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్ధాపన కూడా చేశారు.
అయితే అప్పటి నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. స్వరాజ్ మైదానం మొత్తం జలవనరుల శాఖ ఆధీనంలోనే ఉంది. స్వరాజ్ మైదానంలోని 2 ఎకరాల్లో జలవనరుల శాఖ కార్యాలయాలు నడుస్తున్నాయి. మరోవైపు 2 ఎకరాల్లో రైతుబజార్ నడుస్తోంది. వీటికి అదనంగా సమాచారశాఖ కార్యాలయం, పోలీసు అధికారుల కార్యాలయం, ఉద్యోగుల క్వార్టర్లు ఉన్నాయి. అందరూ ఖాళీ చేసి సాంఘిక సంక్షేమ శాఖకు భూమి అప్పగించాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. అయినా నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు.
ఏప్రిల్ నాటికి పూర్తవుతుందా?
స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతోపాటు పార్కు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నా అధికారులు మాత్రం అడుగు ముందుకు పడనీయడం లేదు. జలవనరుల శాఖకు చెందిన ఐదుగురు ఉన్నత అధికారులు వారి సిబ్బంది మైదానంలోని కార్యాలయంలో పనిచేస్తున్నారు.
కృష్ణ డెల్టా కాలువల పర్వవేక్షణ మొత్తం ఇక్కడ నుంచే జరుగుతోంది. ఇలాంటి కీలక శాఖను తరలించేందుకు ప్రయివేటు భవనాలు కూడా దొరకడం లేదని అధికారులు వాపోతున్నారు. అదే విషయాన్ని సీఎంతో జరిగిన సమావేశంలోనూ వివరించారట. అయినా ప్రత్యామ్నాయం చూపకుండా వెంటనే ఖాళీ చేయమంటే 200 మంది పనిచేసే కార్యాలయాన్ని ఎక్కడ పెట్టాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఒక్క అడుగూ ముందుకు పడలేదు..
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికే అంబేద్కర్ పార్కు అభివృద్ధి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే వివిధ శాఖల కార్యాలయాలు మైదానంలోని భవనాల్లో ఉండటంతో వాటిని తరలించడంమే కష్టంగా మారింది. మరోవైపు ప్రయివేటు పాలిటిక్నిక్ కళాశాలకు 2 ఎకరాల భూమి లీజుకు ఇచ్చారు. లీజు గడువు పూర్తి కాకుండా ఎలా ఖాళీ చేస్తామంటూ వారు కోర్టును ఆశ్రయించారు. ఇన్ని అవాంతరాల మధ్య అసలు అంబేద్కర్ పార్కు పూర్తవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ మైదానంలో ఏది తలపెట్టినా అంతేనా…
విజయవాడ స్వరాజ్ మైదానంలో గతంలోనే అనేక నిర్మాణాలు చేయాలని భావించారు. అయినా అడుగు ముందుకు పడలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించారు. వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పనులు అడుగు ముందుకు పడలేదు. విజయవాడ ప్రజలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌గా స్వరాజ్ మైదానం చక్కగా ఉపయోగపడుతోంది. నగరం మధ్యంలో ఇంత ఖాళీ స్థలం మరెక్కడా లేదు. దీనిలో కూడా నిర్మాణాలు చేస్తే ఇక విజయవాడలో ఎగ్జిబిషన్లు, సమావేశాలు నిర్వహించుకోవడం సాధ్యంకాదని బెజవాడ వాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ మైదానంలో ఏది తలపెట్టినా ఒక్క అడుగు ముందుకు పడదనే సెంటిమెంట్ మాత్రం బలంగా ప్రజల్లో వినిపిస్తోంది.










