డీవీ సదానంద గౌడ.. కర్ణాకటకు సీఎంగా వ్యవహరించిన ఈ వృద్ధ నేత ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. బీజేపీకి చెందిన ఈ సీనియర్ నేత.. ప్రస్తుతం రమేశ్ జార్కిహోళిని ఉక్కిరిబిక్కిరి చేసిన రాసలీలల సీడీల వ్యవహారం ఓ రేంజిలో భయపెడుతోందట. అందుకే.. ఎందుకైనా మంచిదని నేరుగా కోర్టును ఆశ్రయించి.. తనకు సంబంధించిన ఏ వ్యక్తిగత వ్యవహారాలపై కథనాలు రాకుండా మీడియాపై ఆంక్షలు విధించాలని ఆర్డర్ తెచ్చుకున్నారు. వినడానికి వింతగానే ఉన్నా.. కన్నడనాట రాజకీయ కుట్రలపై ఇటీవలి కాలంలో మీడియా తనదైన శైలిలో కథనాలు రాస్తోంది. ఎవరు ఎవరిపై లీకులు ఇచ్చేసినా.. ముందూవెనుకా చూసుకోకుండా కథనాలు కుమ్మేస్తోంది. తమకు అందిన సమాచారం ఏ మేర వాస్తవమన్న విషయాన్ని కూడా అక్కడి మీడియా చూడటం లేదన్న వాదనలూ రేకెత్తుతున్నాయి. ఈ కోణంలో చూస్తే.. సదానంద కోర్టును ఆశ్రయించడం సబబుగానే కనిపిస్తున్నా.. ఏ తప్పూ చేయనప్పుడు ఇలాంటి భయం ఎందుకన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా తనపై వ్యక్తిగత కథనాలు రాయకుండా మీడియాపై ఆంక్షలు అమలయ్యేలా సదానంద తీసుకున్న చర్య మాత్రం వైరల్ గా మారిపోయింది.
సదానంద అభ్యర్థనకు కోర్టు ఓకే
సరే మరి.. సదానంద ఏం చేశారన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి. తన వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత సమాచారం, తనకు సంబంధించిన ఎలాంటి తప్పుడు కథనాలు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రసారం కాకుండా మీడియాకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి సదానందగౌడ బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జరిగిన విచారణలో సదానందగౌడ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంది. ఆపై సదానందగౌడ పరువుకు భంగం కలిగించే రీతిలో ఎవ్వరూ ఎలాంటి వార్తలు ప్రసారం చెయ్యకూడదని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు అన్ని మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ భయం ఎందుకంటే..?
ఈ తరహా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి గల కారణాలను సదానంద వివరించారు. గత ఎన్నికల్లో తన ప్రత్యర్థులు రాజకీయంగా తనను ఎదుర్కోవడానికి అనేక ఎత్తులు వేశారని, ఇప్పుడు కూడా అలాంటి ఎత్తులు వేసి నకిలీ సీడీలు, నకిలి ఫోటోలు, వీడియోలు మీడియాకు విడుదల చెయ్యకుండా ముందు జాగ్రత్తగా తాను కోర్టును ఆశ్రయించానని సదానందగౌడ క్లారిటీ ఇచ్చారు. మీడియా అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, మీడియాను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులు తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నకిలీ వీడియోలు తెరమీదకు తెచ్చే అవకాశం ఉందని అనుమానంతో తాను కోర్టులో ఈ పిటిషన్ వేశానని.. అంతకు మంచి తనకు ఎలాంటి సమస్యలు లేవని సదానందగౌడ వివరణ ఇచ్చారు. మొత్తం మీద కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపడుతున్న సమయంలో సదానందగౌడ కోర్టులో స్టే తెచ్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.











