సాయిధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో తాజాగా జీ స్టూడియోస్ భాగస్వామ్యమైంది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు బుధవారం సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేస్తూ ఈ విషయాన్ని తెలిపాయి. సాయిధరమ్ తేజ్, నభా నటేష్ అద్భుత నటనతో ఈ చిత్రం ఉంటుంది. వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. రొమాన్సు, ఫన్, కామెడీతో పాటు సందర్భానుసారంగా వచ్చే భావోద్వేగాలు ఆధ్యంతం హత్తుకుంటాయి. ప్రతి సన్నివేశాన్ని నూతన దర్శకుడు సుబ్బు ఎంతో బాగా మలిచారు.
అందమైన సినిమాటోగ్రఫీ, తమన్ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. డిసెంబర్లో థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఆ సంస్థలు వెల్లడించాయి. హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, జీ గ్రూప్ ఈ చిత్రంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ప్రేక్షకులను ఈ చిత్రం అలరింపజేస్తుంది అని అన్నారు. జీ స్టూడియోస్ సీఈవో శారిక్ పటేల్ మాట్లాడుతూ, ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో మేము భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం నటీ నటులు, సాంకేతిక వర్గంతో పాటు మా రెండు సంస్థలకు పేరు తెచ్చి పెడుతుందన్న నమ్మకం ఉంది అని చెప్పారు. ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణాన్ని, తమన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా ..నవీన్ నూలి ఎడిటింగ్ ను అందిస్తున్నారు.











