(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
పూజలు చేస్తే దేముడు దిగి వచ్చేస్తాడా ..!? పాలు పోస్తే పాము తాగేస్తుందా ..!? పుట్టలో గుడ్లు వేస్తే పాము తినేస్తుందా ..!? అంటూ నాస్తికులు, ఆస్తికులను వెటకారం చేస్తుంటారు. మత, ఆధ్యాత్మిక విశ్వాసలతో పూజలు చేసే భక్తులను ఆకతాయిలు ఆట పట్టిస్తుంటారు. ఇటువంటి ఆటలు, మాటలను బలాదూర్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా కొరసవాడలో నాగుల చవితి రోజు బుధవారం భక్తులందరూ భక్తి విశ్వాసాలతో పుట్ట దగ్గరకు వెళ్లి పూజ చేస్తూ, పుట్టలో గుడ్లు వేస్తున్న తరుణంలో నేరుగా అక్కడ నాగుపాము ప్రత్యక్షమైంది. భక్తులు సమర్పించిన గుడ్లును ఆరగించింది. ఈ సంఘటన అక్కడ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు దేమునిపై విశ్వాసాన్ని పెంచింది. ఈ సంఘటనను అక్కడ భక్తుల్లో ఒకరు తన మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా నాగులచవితి అంటే ఏంటి ..? దాని విశిష్టత ఏంటి తెలుసుకుందామా ..!
Must Read ;- నగ్నంగా పూజలు చేయాలి.. రాత్రికి రమ్మన్న పూజారి
పండుగ వెనుక పరమార్థం
ప్రతి పండుగ వెనుక ఓ పరమార్థం ఉంది. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి పండగకూ అటువంటి పరమార్ధమే ఉంది. దేశంలో అతిప్రాచీనమైన పూజ నాగారాధన. ఇంద్రునికి శతృవైన వృత్రుడు నాగజాతివాడు, సర్పదేవతలకు రాజు సహస్రగుణుడైన అనంతుడు విష్ణువుకు శయనంగా అమరినవాడు, శివుడు నాగాభరణుడు, ఈ భూమికి ఆధారం వాసుకి అనే సర్పం, మన రాష్ట్రంలో శ్రావణ శుద్ధపంచమి నాడు నాగపంచమి, కార్తీకశుద్ధ చవితినాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం.
ఆశ్లేషనక్షత్రానికి అధిష్టానదేవత సర్పం, నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు ప్రధానంగా రెండు ఉన్నాయి. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజా విధానాన్ని వివరించింది. వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం.
విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడిందని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది.
వృశ్చికరాశిలో జ్యేష్టానక్షత్రం సర్పనక్షత్రం, ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భమే నాగులచవితి. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి.
ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వార ఆ విషాన్ని హరించవచ్చు అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు, కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే ఈ కార్తీకమాసమని శాస్త్రాలు శ్లాఘిస్తున్నాయి.
ఇంతటి ఘనచరిత్ర కలిగిన నాగులచవితిని భారతీయులందరూ ముఖ్యంగా హిందువులు అనాదిగా ఆచారంగా నిర్వహిస్తుండటం ముదావహం.
Also Read ;- గురువు మకర రాశిలోకి ప్రవేశం.. 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు











