స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 చిత్రాలు రూపొందడం.. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సస్ సాధించడంతో తాజాగా చేస్తున్న పుష్ప మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.
ఈసారి ఎలాంటి అడ్డంకులు రాకుండా పక్కా ప్లాన్ తో షూటింగ్ చేసి.. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు చిత్రయూనిట్. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే.. ఫిదా బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటిస్తుందని. మరో విషయం ఏంటంటే.. ఇందులో నటించడం కోసమే ‘ఆచార్య’ సినిమాలో ఛాన్స్ వస్తే.. నో చెప్పిందట.
సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తుంది. అలాగే దగ్గుబాటి రానాతో విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. కెరీర్ లో దూసుకెళుతున్న ఈ టైమ్ లో స్టార్ హీరో బన్నీకి సిస్టర్ గా నటించడానికి ఓకే చెబుతుందా..? అనే అనుమానాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త షికారు చేస్తుంది. మరి.. పుష్ప టీమ్ కానీ.. ఆచార్య టీమ్ కానీ.. క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.