వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి భయం మొదలైందా..మొన్న వంశీ, నిన్న పోసాని అరెస్టుల నేపథ్యంలో తమ అరెస్టు తప్పదని ఆందోళన చెందుతున్నారా..అంటే నిజమేననిపిస్తోంది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, వైసీపీ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌లను దూషించిన కేసులో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఐతే విచారణలో సజ్జల రామకృష్ణా రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే తాను నడుచుకున్నానని పోసాని చెప్పారు. అంతేకాదు తాను మాట్లాడిన వీడియోలను సజ్జల కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి సోషల్‌మీడియాలో వైరల్ చేశారని పోలీసుల ముందు ఒప్పుకున్నారు.పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పీఎస్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 17కుపైగా కేసులు నమోదయ్యాయి.
పోసాని నేరాన్ని ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇవ్వడంతో..సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నమోదుచేసిన కేసులో తమను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, ముందస్తు బెయిల్ మంజూరుచేయాలని కోర్టును కోరారు.
ఈ కేసులో A1-గా ఉన్న పోసాని కృష్ణమురళి.. తమ పేర్లను పోలీసుల ముందు వాంగ్మూలంలో చెప్పారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాము అమాయకులమని, అనవసరంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బెయిల్ పిటిషన్‌లో చెప్పారు. కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా, మాకు ఈ నేరంలో పాత్ర ఉంది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు సజ్జల. కేవలం రాజకీయ ప్రతీకారంతో తప్పుడు కేసులో ఇరికించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు, పులివెందులలో శాశ్వత నివాసాలున్నాయని, తప్పించుకుపోయే ప్రశ్నే ఉత్పన్నం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతామని చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు.











