కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏపీలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాలు మారిపోతున్నాయి. వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి హ్యాండిచ్చి కూటమిలో చేరుతున్నారు. ప్రస్తుత పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టి ఈ నెల 18 నాటికి దాదాపు 4 ఏళ్లు పూర్తి కానుంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఆ తర్వాత మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీన్ని ఉపయోగించుకుని ప్రధాన నగరాల్లో పట్టు బిగించాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలకు అడ్డూ లేకుండా పోయింది. ఇతర పార్టీల తరపున నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు దా*డులు, బెదిరింపులకు దిగారు. అలా రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు.
నిధుల మళ్లీంపుతో వైసీపీపై వ్యతిరేకత
వైసీపీ ప్రభుత్వం పట్టణ, స్థానిక సంస్థలను పట్టించుకోలేదు. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించడంతో సొంత పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లలోనే తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. వీధుల్లో గోతులు కూడా పూడ్చలేకపోతున్నామని, పాడైన వీధి దీపాల స్థానంలో కొత్తవి పెట్టించలేని దయనీయ స్థితిలో ఉన్నామని సమావేశాల్లో వైసీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు గతంలో చూశాం. ఆస్తి పన్ను, ఇతర ఆదాయ వనరులను కూడా ప్రభుత్వం సరిగా విడుదల చేయని కారణంగా వైసీపీ సర్కార్ పాలనలో పనులంటేనే కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డివిజన్లలో అభివృద్ధి పనులు చేయించుకోవాలని కొందరు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రోద్బలంతో ఇంకొందరు..వైసీపీకి గుడ్‌బై చెప్పి కూటమిలో చేరుతున్నారు. విశాఖ నుంచి అనంతపురం వరకు దాదాపు అన్ని ప్రధాన నగరపాలక సంస్థల్లోనూ వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడుతున్నారు.
కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత విశాఖ, గుంటూరు నగరపాలక సంస్థల్లో నిర్వహించిన స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి సభ్యులు విజయం సాధించడం ద్వారా ఆ పార్టీలు కార్పొరేషన్లలో పట్టు సాధించేందుకు లైన్ క్లియర్ అయింది. విశాఖలో వైసీపీకే కార్పొరేటర్ల ఆధిక్యం ఉంది. గత మూడేళ్లూ స్థాయీ సంఘం సభ్యులుగా ఆ పార్టీ కార్పొరేటర్లే ఎన్నికవుతున్నారు. ఈసారి అనూహ్యంగా వైకాపా కార్పొరేటర్లు 10 మంది బాహాటంగా, మరికొందరు పరోక్షంగా కూటమికి సహకరించడంతో ఫలితాలు రివర్స్ అయ్యాయి. గుంటూరులో వైసీపీ కార్పొరేటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతివ్వడంతో స్థాయి సంఘం ఎన్నికల్లో ఆరుగురు కూటమి సభ్యులు విజయం సాధించారు. మార్చి 18 తర్వాత విశాఖ, విజయవాజ, గుంటూరు, నెల్లూరు నగరపాలక సంస్థల్లో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూటమి పార్టీలు యోచిస్తున్నాయి.











