వైఎస్ఆర్ సీపీ గత ఎన్నికల వేళ దారుణ పరాజయం మూటగట్టుకోవడంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి కూడా ఒక ప్రధాన కారణం అని నేతలు అందరూ బలంగా నమ్ముతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్ల నుంచి జగన్ కోటరీలో ఓ వ్యక్తిగా ఈయన తన రాజ్యాన్ని ఏలారు. ఎంతో మంది వైసీపీ నేతలకు సజ్జల అంటేనే గొంతు వరకూ కోపం ఉంది. కానీ, అతణ్ని దూరం పెట్టాలని జగన్ కు చెప్పే ధైర్యం ఎవరూ చేయలేరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా జగన్ పెడచెవిన పెడుతుండేవారు. ఇప్పటికి కూడా సజ్జలని జగన్ దూరం పెట్టాలని వైసీపీలో 90 శాతం మంది నేతలు బలంగా కోరుకుంటున్నారు. జగన్ కు ఒక వలయంగా ఉంటూ వచ్చి.. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు ఏంటో, అసలు నిజాలేమిటో ఆయనకు తెలియనివ్వకుండా సజ్జల చేస్తూ వచ్చారని అంతా భావిస్తున్నారు.
కనీసం ఎన్నికల ఫలితాల తర్వాత బుద్ధి తెచ్చుకొని సజ్జలను జగన్ దూరం పెడతారని అనుకున్నారు. కానీ జగన్ ఎవర్నీ లెక్కలేయలేదు. సజ్జలను తన మనిషిలాగే భావిస్తున్నారు. దీంతో వైసీపీలో అదే అసంతృప్తి కనిపిస్తోంది. కనీసం సజ్జలను దూరం జరిపితే పార్టీ నేతల్లో కాస్త ఉపశమనం కనిపించేది. జగన్ కనీసం దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారని క్యాడర్ భావించేవారు. కానీ జగన్ అలాంటిదేమీ చేయకపోవడంతో ఇక ఈయన ఇంతే.. అనే నిర్ణయానికి వైసీపీ నేతలు వచ్చేశారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
సజ్జల.. జగన్ ని తన విచిత్రమైన కుట్ర సిద్ధాంతాలు, తప్పుడు రాజకీయ వ్యూహాలతో నిలువునా నష్టం కలిగించారు. ఈ విషయం టీడీపీతో పాటు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. కానీ, పాపం జగన్ కే అర్థం కావడం లేదు. వైసీపీ అధికారంలో ఉండగా సజ్జల వ్యూహాలు కూడా మరీ లేకిగా ఉండేవి. ప్రజల్లో ఏ మాత్రం ఆదరణ లేని వాళ్లతో టీడీపీ నేతల్ని తిట్టించడమే రాజకీయం అనుకునేవారు. ఆ క్రమంలోనే పోసాని క్రిష్ణ మురళి, రామ్ గోపాల్ వర్మ, యాంకర్ శ్యామల లాంటి వాళ్లతో బేరం మాట్లాడుకొని చంద్రబాబును తిట్టించారు. తద్వారా వైసీపీకి మేలు జరుగుతుందని భావించారు. పోసాని మాట్లాడే మాటలు వింటే వైసీపీ వాళ్లకూ విరక్తి పుట్టేలా ఉండేవి.
పోసాని క్రిష్ణ మురళి, ఆర్జీవీ లాంటి వారు ఎంతో మంది వైసీపీ అధికారంలో ఉండగా కనీసం విలువ లేకుండా ప్రవర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారు. అయితే, సజ్జల కనీస వాల్యూ లేని వాళ్లను ఎంగేజ్ చేసుకుని మొత్తం పార్టీ ప్రతిష్ఠను నాశనం చేశారని అంటున్నారు. ఇప్పుడు కూడా సజ్జల అదే చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాట్లాడే ప్రతి స్క్రిప్టు కూడా సజ్జల ఆఫీసు నుంచే వెళ్తున్నాయి. ఇక ముందు కూడా ఇలాంటి క్యారెక్టర్లతోనే ప్రభుత్వంపై పోరాటం చేస్తే.. వైసీపీ కోలుకునే ఛాన్సే ఉండదని టీడీపీ నేతలు కూడా భరోసాగా ఉంటున్నారు. అందుకే సజ్జలపై ఈ మధ్య పెద్దగా విమర్శలు కూడా చేయడం లేదు.