జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా అప్పటి తన ఎంపీ రఘురామ క్రిష్ణం రాజును ఏరకంగా టార్చర్ పెట్టారో అందరికీ తెలుసు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రఘురామక్రిష్ణం రాజు ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ సీపీలో నరసాపురం ఎంపీగా ఉండగా.. జగన్ మోహన్ రెడ్డి ఆయనపై అక్కసుతో అక్రమ కేసులు బనాయించి పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. తన ఒంటిపై గాయాలు అన్నింటిని చూపిస్తున్నప్పటికీ తాము అలాంటిదేమీ చేయలేదని అప్పట్లో బుకాయించారు.
కానీ, ఆ కేసులో అప్పడు సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్‌కుమార్ అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే.. తాను రఘురామను కొట్టానని.. అలా వీడియోకాల్‌లో సీఐడీ బాస్‌కు చూపించామని.. అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సైతో పాటు ఇతర సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే కాల్ కట్ చేసి ఆయన నేరుగా రఘురామను ఉంచిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వారు తెలిపారు. ఆయన ముసుగు వేసుకొని మరీ తన మనుషులతో వచ్చి కొట్టించారని చెప్పారు. 2021 మేలో జరిగిన ఆ ఘటనకు సంబంధించి తాజాగా గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు. సీఐడీ చీఫ్ సెల్‌ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. కేసు దర్యాప్తును మొత్తానికి ఓ కొలిక్కి తెచ్చారు.
సొంత పార్టీలోనే ఉండి తన నిర్ణయాలను రఘురామ తప్పుబడుతున్నారని, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే అక్కసుతో జగన్ రెడ్డి రఘురామపై సీఐడీ పోలీసుతో రాజద్రోహం కేసు పెట్టించారు. 2021 మే 14న అరెస్టు చేసి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించి హత్యాయత్నం చేశారని రఘురామ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఉండగా కేసు పెట్టడం సాధ్యం కాకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జులై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో రఘురామ ఫిర్యాదుచేశారు.
మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విచారణ అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి వారిపై హత్యాయత్నం కేసులు నమోదుచేసి విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్‌ను రఘురామ కోరారు. ఈ మేరకు ఏఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా పోలీసులు పలువురిని విచారించగా.. తాజాగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. దీంతో నాటి పాలకుల మెడకు గట్టి ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో ఒకరిద్దరు పోలీసులు అప్రూవర్లుగా మారే అవకాశం ఉన్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి.











