అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలు మరోసారి మొదలైనట్టు కనిపిస్తోంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన అనుచరుల దాడి ఘటన తరవాత అక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనను ఎలాగైనా చంపించేయాలని చూస్తున్నాడంటూ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణ హాని ఉన్నా గన్‌మెన్‌ను ఇవ్వలేదని, వ్యక్తిగత గన్ కు లైసెన్సు కూడా రెన్యూవల్ చేయలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చంబల్ లోయలో ఉండాల్సిన వారు
తాడిపత్రి ఎమ్మెల్యే, ఆయన తండ్రి అరాచకాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి చదివి మీడియాకు వినిపంచారు. 1993లో గ్రామాలపై పడి బంగారం దోచుకున్నారని, ఇలాంటి వారు చంబల్ లోయలో ఉండాల్సిన వారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి తనతో మాట్లాడటానికి మా ఇంటికి వచ్చినట్టు లేదని, మాట్లాడుకోవడానికి మారణాయుధాలు తీసుకువస్తారా? అంటూ జేసీ ప్రశ్నించారు. తాను మాత్రం కేసు పెట్టే ప్రసక్తే లేదని, పోలీసులు సీసీ ఫుటేజీ చూసుకుని సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాను కేసు పెడితే తన ఇంట్లోకి ప్రవేశించిన 9 మంది పోలీసులు, ఒక ఎస్సై సస్పెండ్ అవుతారని జేసీ గుర్తు చేశారు. అందుకే తాను కేసు పెట్టడం లేదన్నారు. వారి జీవితాలు నాశనం చేయడం తనకు ఇష్టం లేదన్నారు.
పైనుంచి ఒత్తిడులు
పోలీసులను ఎవరిని కదిలించినా పైనుంచి ఒత్తిడులు ఉన్నాయని చెబుతున్నారని జేసీ తెలిపారు. ఎస్పీ నా చేతుల్లో ఏమీ లేదంటున్నారని, పైనుంచి ఒత్తిడులు ఉన్నాయనడం దారుణమన్నారు. మీకు బుర్ర ఉంది కాబట్టి ఐపీఎస్ అయ్యారు. మీ తీరుతో పోలీసు డ్రెస్‌కు గౌరవం పోయిందని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. నా బస్సులకు ఏడాదిగా లైసెన్సులు ఇవ్వకుండా వేధిస్తున్నారని అయినా పోరాడి తెచ్చుకుంటామన్నారు