దేవుని భూములు దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా, అర్థరాత్రి వేళ జీవోలు విడుదల చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వం పని తీరును ఎండగట్టారు.
ఓడిపోతామనే భయంతోనే ..
‘స్థానిక’ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలంటే భయపడుతోందని వంగలపూడి అనిత విమర్శించారు. ఎన్నికలకు కరోనా ఉందని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్, సినిమా హాల్స్‌ను తెరవడానికి ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ పాదయాత్రల్లో మంత్రులకు భద్రతనిస్తున్న పోలీసులకి కరోనా రాదా..? అంటూ ఆమె ప్రశ్నించారు.
Must Read: తెలుగు సీఎంలూ.. కాస్త పక్క రాష్ట్రాలు చూడండి..
‘మాన్సాస్’ ను విచ్ఛిన్నం చేయడానికే ..
రాష్ట్ర ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్‌లో అనవసరంగా జోక్యం చేసుకుంటోందని, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతోందని అనిత ఆరోపించారు. సంచైత శర్మని అర్ధరాత్రి దొంగ దారిలో జీవోలు ఇచ్చి ఛైర్ పర్సన్ చేశారని, మాన్సాస్ బైలాస్ ప్రకారం చైర్మన్ పదవి అశోక్ గజపతి రాజుకే చెందుతుందని ఆమె అన్నారు. సింహాచలం భూములను దోచుకొవడానికి సంచైత శర్మ అనే పప్పెట్‌ని ముఖ్యమంత్రి జగన్, విజయసాయి రెడ్డిలు బయటకు తీసుకొచ్చారంటూ విమర్శించారు. కోర్టు కేసులు నడుస్తుండగా సంచైత శర్మకి అనుకూలంగా ఎలా జీవోలు ఇస్తారంటూ ఆమె ప్రశ్నించారు. హిందూ దేవాలయాల్లో ఏ పూజలు చేస్తారో కూడా తెలియని వారిని చైర్మన్‌లు చేస్తున్నారని, సింహాచలం దేవస్థానంలో బిర్యానీలు సైతం వండుకుని తింటున్నారని, ఇదెక్కడి చోద్యమని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దేవస్థానం భూములపై కర్చీఫ్ వేసేసారని, ప్రస్తుతం విజయనగరం జిల్లాపై పడ్డారని అన్నారు.
స్థానికులు గమనిస్తున్నారు ..
ప్రభుత్వ తీరును, మాన్సాస్ లో అనవసర జోక్యాన్ని విజయనగరం జిల్లా ప్రజలు గమనిస్తున్నారని, అవసరమైన వేళ రాష్ట్ర ప్రభుత్వానికి వారే సరైన బుద్ది చెబుతారని అనిత స్పష్టం చేశారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన సంచైత శర్మను అడ్డదారిలో మాన్సాస్ ఛైర్ పర్సన్ గా నియమించడంలో ఆంతర్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విజయనగరం జిల్లా పరిసర ప్రాంత ప్రజలంతా మాన్సాస్ ద్వారా విద్యాబుద్ధులు నేర్చినవారేనని, ప్రతిదీ వారు గమనిస్తున్నారని తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్‌లో సభ్యులుగా ఉన్న స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్కడ నుండో వచ్చిన వారికి వత్తాసు పలకకుండా విజ్ఞతతో ఆలోచించాలని అన్నారు.
మాన్సాస్‌ను విచ్చిన్నం చేయడం ద్వారా అశోక్ గజపతిరాజు ప్రతిష్టతను దెబ్బతీయడానికి, తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి వైసీపీ ప్రభుత్వం యోచిస్తోందని, అది జరిగే పని కాదని అన్నారు. అశోక్ గజపతిరాజు ద్వారా తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని అన్నారు.