టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చైర్మన్ గా ఉన్నసంగం డెయిరీ స్వాధీనం విషయంలో జగన్ సర్కారుకు చుక్కెదురైంది. సంగం బెయిరీ స్వాధీనం కోసం జగన్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను ఇప్పటికే ఓ దఫాహైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేస్తే.. తాజాగా అదే న్యాయస్థానానికి చెందిన ద్విసభ్య ధర్మాసనం కూడా జగన్ సర్కారుకు షాకిచ్చింది. సంగం డెయిరీ స్వాదీనం కుదరదంటూ సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పు సరైనదేనంటూ సంచలన తీర్పు వెలువరించింది. వెరసి హైకోర్టులో జగన్ సర్కారు మరో్ మొట్టికాయ పడినట్టైంది.
అమూల్ కోసం సంగంలో అలజడి
ఏపీ సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన పాలన ఎలా సాగుతుందన్న విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికగానే చెప్పేశారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలను తవ్వి తీస్తానని ప్రకటించిన జగన్.. ఆ దిశగా చాలా స్పీడుగానే వెళ్లారు. అయితే ఎక్కడికక్కడ ఆయనకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీలో సీనియర్ నేతగానే కాకుండా.. పార్టీ గుంటూరు జిల్లా శాఖలో తిరుగులేని నేతగా ఎదిగిన ధూళిపాళ్లపై జగన్ అండ్ కో కన్ను పడింది. ఈ క్రమంలోనే ధూళిపాళ్ల చైర్మన్ గా కొనసాగుతున్న సంగం డెయిరీలో అక్రమాలంటూ తెర తీశారు. కొత్తగా రాష్ట్రంలోకి తాము తీసుకొచ్చిన అమూల్ కు గుంటూరు జిల్లాలో మెజారిటీ వాటా దక్కాలంటే.. సంగం మూతపడాల్సిందేనన్న భావనతోనే ఈ చర్యలకు శ్రీకారం చుట్టారన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో సంగం డెయిరీలో సోదాలు, ధూళిపాళ్ల అరెస్ట్, రిమాండ్. ఆనక బెయిల్.. ఇలా వెంటవెంటనే పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కోర్టేం చెప్పిందంటే..?
రాష్ట్ర ప్రభుత్వం సంగం డెయిరీని తన అధీనంలోకి తీసుకుని గుంటూరు జిల్లా తెనాలి ఆర్డీఓ అజమాయిషీలో నిర్వహించేందుకు వీలుగా 27-04-2021న జారీ చేసిన జిఓ నం.19 చెల్లనేరదని హైకోర్టు బుధవారం నాడు విస్పష్ట తీర్పునిచ్చింది. గతంలోనే జస్టిస్ DVSS సోమయాజులు జీవో అమలుపై స్టే మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం స్టే మంజూరును ఛాలెంజ్ చేస్తూ చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయగా.. సుదీర్ఘ విచారణ అనంతరం బుధవారం హైకోర్టు తీర్పును వెలువరించింది. వెరసి సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే దిశగా సాగిన జగన్ సర్కారుకు హైకోర్టులో బ్రేకులు పడిపోయాయి.