రవివర్మకే అందని ఒకే ఒక అందం చీరలోనే కనిపిస్తుంది. అందుకేనేమో రవివర్మ తను వేసిన బొమ్మల్లో చీరకు అంత చోటిచ్చాడు. అలాంటిది తెలుగు సినిమా మీద చీర అలిగిందో.. సినిమాకి చీర మీద కోపమొచ్చిందో తెలియదుగానీ చూద్దామంటే సినిమాలో చీరలే కనిపించడం లేదు.
చీర ఏ పాపం చేసిందోగానీ సినిమాలో అమ్మలు కూడా చీర కట్టడం మానేసే రోజులొచ్చాయి. చీర కడితే ఆంటీ అనేరన్న భయం సినిమా అమ్మలకు ఉందేమోనని కూడా అనిపిస్తోంది. చీర డైలాగులు.. చీర పాటలు.. ఒకప్పుడు కళకళలాడిపోయింది తెలుగు సినిమా. నేడు ఈ పేరెత్తితేనే చిరిగిపోద్ది అనేలా పరిస్థితి తయారైంది. పోనీలే సినిమాల్లో చీరెలు లేకపోయినా పెళ్లళ్లలో మాత్రం చీరెల కళ కనిపిస్తోంది. సినిమా తారలు సైతం పెళ్లళ్లకు హాజరు కావలసి వస్తే మాత్రం చీరెలతో హొయలు ఒలకబోస్తున్నారు. ఇటీవల నిహారిక పెళ్లిలో ఎన్నో రకాల చీరెలు తళుక్కుమన్నాయి. మరి సినిమాలు ఏం పాపం చేసుకున్నాయో చీరెలకు ఇందులో చోటివ్వడం లేదు. దర్శకుల అభిరుచి మారిందో.. తారలకు వాటిని కట్టుకోవాలంటే సిగ్గేస్తుందో అన్నది మాత్రం అర్థం కావడం లేదు.
ఆ పాటల్లో పస అంతా చీరల వల్లే..
సినిమాల్లో చీరెల మీద ఎన్నెన్ని పాటలో కదా. ‘తెల్ల చీర.. కళ్ల కాటుక.. ఎర్ర బొట్టు.. పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మా..’ అంటూ ‘సర్దార్ పాపారాయుడు’ సినిమాలో ఎన్టీఆర్ స్టెప్పులేస్తుంటే థియేటర్లో సీట్లు చించేసిన రోజులున్నాయి. ‘నీ కోక కింత కులుకెందుకు..’, ‘కట్టుకున్నా అదే చీర.. పెట్టుకున్నా అవే పూలు..’, ‘నల్లంచు తెల్ల చీర.. తల్లోన మల్లెమాల’.. ఇలా చెప్పుకుంటే ఎన్నెన్ని పాటలు. కట్టు బొట్టు అనేవి మన తెలుగింటి సంప్రదాయం. చీరల గురించి కవుల హృదయాలు స్పందించాలన్నా చీరలు కనిపించాలి కదా. ‘కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..’ లాంటి పాటలు రాయడం సాధ్యమా?.. చీరే లేకుంటే ఇక పైటేసే దెట్లా.
Must Read ;- మెగా డాటర్ నిహారిక పెళ్లి చీరపై సోషల్ మీడియాలో రచ్చ
ఒకనాటి హీరోయిన్ వాణిశ్రీ చీరె కడితే చూడముచ్చటగా ఉండేది. చీరె కట్టడంలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకునేవారు. రంగు రంగుల చీరెల్లో ఎన్నెన్నో హంగులు కనిపిస్తాయి. ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది’ అన్న పాటను అప్పట్లో రాశారు. ఇప్పుడు చెంగావి రంగు అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఉంది. ‘అడవి రాముడు’ సినిమాలో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి’ అన్న పాట ఎంత పెద్ద హిట్టో కదా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో ఈ పాట అంతకుమించిన హిట్టు. అప్పట్లో చీరెలు ఉన్నాయి కాబట్టి అడవిరాముడులో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అని పాటేసుకున్నారు.
జ్యోతిలక్ష్మి చీర కడితే..
అప్పటి సినిమాల్లో వాంప్ పాత్ర చీర కడితే అంతకంటే పెద్ద విశేషమేముంటుంది. ‘సర్దార్ పాపారాయుడు’ సినిమాలో అలాంటి వింత ఆలోచన దర్శకుడు దాసరి నారాయణరావుకు వచ్చింది. జ్యోతిలక్ష్మి మీద సినిమాలో ఓ పాట పెట్టేశారు. ‘జ్యోతిలక్ష్మి చీర కట్టింది.. చీరకే సిగ్గేసింది’ అనే ఈ పాట మొదట్లో సినిమాలో లేదు. చాలామంది ఆడియోలో ఈ పాట విని కేవలం దీని కోసమే సినిమాకి వెళ్లి అందులో ఈ పాట లేక నిరాశపడిన సందర్భాలు ఉన్నాయి. సినిమాలో తర్వాత ఈ పాటను చేర్చారు. సినిమాకే ఈ పాట హైలైట్ గా నిలిచింది. ఇప్పుడైతే ‘హీరోయిన్ చీర కట్టిందీ.. చీరకే సిగ్గేసింది’ అని మన కవులు రాయాల్సి వచ్చేదేమో.
Also Read ;- హోస్ట్ అవతారమెత్తుతోన్న మాజీ హీరోయిన్
అప్పట్లో ఈ పాటను జ్యోతిలక్ష్మికి పెట్టారు.. ఇప్పుడైతే హీరోయిన్ కు పెట్టి షూటింగ్ చేయడం తప్ప మరో మార్గంలేదు. అంతెందుకు సినిమాల్లో ఆంటీలే అంటే హీరోల తల్లులూ గట్రా చీరెలు కట్టడం లేదు. హీరోయిన్ కన్నా గ్లామర్ గా కనిపించాలని వారు కూడా తాపత్రయ పడుతున్నారు. అసలు గ్లామర్ అంటే ఏంటి.. చీరలో గ్లామర్ ఉండదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే చీర అందం మరి దేనికీ రాదు. హీరోయిన్ తెలుగింటి అమ్మాయిలా కనిపించాలంటే ఎలా కనిపిస్తుంది. అసలు తెలిగింటి అమ్మాయిలు మనకు వద్దనే కదా మన నిర్మాతలు, దర్శకులు పరభాషా అమ్మాయిలను వెతికి మరీ తెచ్చుకుంటున్నారు.
తారల పేర్లతో చీరెల అమ్మకాలు
సినిమా తారల పేర్లతో చీరెలు అమ్మేవారన్న సంగతి మీకు తెలుసా? ఇది వాణిశ్రీ చీర, ఇది జయప్రద చీర, జయసుధ చీర అంటూ షాపుల్లో అమ్మేవారు. జనం కూడా వాటిని కొనడానికి ఎగబడేవారు. తారల పేర్లే కాదు సినిమాల పేర్లతో చీరలు అమ్మేవారు. దసరాబుల్లోడు చీర, అడవిరాముడు చీర.. ఇలా ఈ పేర్లతో భారీ వ్యాపారమే సాగేది. ఒక్క చీరలే కాదు గాజులు లాంటి ఆభరణాలను కూడా సినిమాల పేర్లతో అమ్మేవారు. అసలు చీర కట్టడం కూడా పెద్ద ఆర్ట్. ఓ పద్దతిగా లైనప్ ఉండాలి.. బొడ్లో కుచ్చిళ్లు దోపాలి, పవిట చెంగు సిరచేసుకోవాలి.. వాటి మాటున అందాలు కనిపించీ కనిపించకుండా ఊరించాలి.
సిల్క్ చీర కడితే అవి వంటిమీద నిలవవంట. జారిపోతాయనే వాటి జోలికిపోమంటున్నారు ఉత్తరాది భామలు. ఆ మధ్య అక్కినేని నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా వచ్చింది. అందులో హీరోయిన్ చీరలు కట్టక తప్పలేదు. ఈ చీర కట్టే విషయంలోనే అందులోని హీరోయిన్ బెంబేలెత్తిపోయింది. అలా అలవాటైందేమో మొన్న నిహారిక పెళ్లికి చీరలోనే కనువిందు చేసేసింది. చీరల సొగసు చూడాలంటే సినిమాల్లోనే సాధ్యం. అందమైన హీరోయిన్ చీర కడితే ఆ సొగసు చూడతరమా.. అందుకే మన తెలుగు సినిమాలో మళ్లీ ఓసారి శారీ.. సారీ.. మన చీర కనిపిస్తుందనీ, దర్శకులు ఓ చీర పాట పెట్టి మళ్లీ ఆ వైభవాన్ని మనకు అందిస్తారని ఆశిద్దాం.
– హేమసుందర్ పామర్తి