ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఒప్పుకోకపోతే చంపడం, యాసిడ్ దాడులు కేసులు పెరిగిపోతున్నాయి. వీటితో పాటు.. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగడం, ఫొటోలు, వీడియోలతో పరువు తీయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటిని కొందరు ఎదుర్కోలోక ఆత్మహత్యలకు పాల్పడడం లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ, పుణెకు చెందిన ఓ యువతి ఇలాంటి ధైర్యంగా ఎదుర్కోంది. కోర్టులో కేసువేసి పోలీస్ రక్షణతో పెళ్లికి సిద్ధమవుతుంది. మరి మనం కూడా తన గురించి తెలుసుకుందాం రండి..
యువతి అపహరణ
పుణెకు చెందిన ఒక యువతి, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి వ్యవహారం, కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తిని దూరం పెట్టడం ప్రారంభించింది యువతి. తన నుంచి దూరంగా ఉండాలని ఆ వ్యక్తికి కూడా చెప్పింది. కానీ, ఆమె మాటల్ని అవమానంగా భావించిన ఆ యువకుడు 2019లో ఆమెను అపహరించడం కూడా జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో ఆమెను అతని చెర నుండి సురక్షితంగా కాపాడారు. దీనిపై కేసు నమోదు చేయగా, తెలివిగా ఆ యువకుడు ముంబై హైకోర్టు ద్వారా ముందస్తు బెయిలు పొందడంతో అరెస్టు చేయలేకపోయారు.
Must Read ;- వైసీపీ నేత బెదిరింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం..
ఆమె నా భార్య
ఇంతటితో ఆగకుండా బారామతి కోర్టులో ఆ యువతిని తన భార్యగా పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసాడా యువకుడు. అంతేకాదు, సోషల్ మీడియాలో పెళ్లైనట్లుగా మార్చుకున్నాడు. వీటితోపాటు ఆమె పేరుకు తన ఇంటిపేరును జోడించి పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. కోర్టు పిటిషన్‌లో సైతం ఆమె పేరుకు తన ఇంటి పేరుతో పేర్కొన్నాడు. ఇలాంటి క్రమంలోనే ఆమెకు మరొకరితో డిసెంబర్ 27న వివాహాం నిశ్చయమైంది. ఇది తెలుసుకున్న యువకుడు సోషల్ మీడియాలో ‘నాతో గొడవ పెట్టుకుంటే.. నీ జీవతం నాశనం చేస్తా’ అంటూ పోస్ట్ చేశాడు. అప్పటి వరకు అతని ఆగడాలను భరించిన ఆ యువతి, ఇక కోర్టులో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.
విడిపోతే బెదిరింపులే మార్గమా..
అనుకున్నదే తడవుగా అతను పోస్ట్ చేసిన సోషల్ మీడియా పోస్టులను జత చేస్తూ లాయర్ ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనను భార్యగా పేర్కొంటూ తన పరువు తీస్తున్నాడని, పెళ్లిని జరగనివ్వనని బెదిరిస్తున్నాడని కోర్టును ఆశ్రయించింది. దానికి సమాధానం చెప్పాల్సిందిగా ఆ వ్యక్తికి కోర్టు సమయం ఇచ్చింది. కానీ ఆ వ్యక్తి నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో యువతి అనుకూలంగా తీర్పునిచ్చింది. యువతి పెళ్లికి పోలీసులు రక్షణ అందించాలని తెలియజేసింది. దానికి సంబంధించిన ఖర్చు యువతి భరించాలని చెప్పింది. పెళ్లి జరుగుతున్న సమయంలో యునిఫాంలో కాకుండా మామూలు వ్యక్తుల్లా ఉంటూ పెళ్లికి రక్షణ అందించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read ;- ఒకరితో ప్రేమపాఠాలు.. ఆరుగురితో వలపు పాఠాలు!
ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..
పుణె యువతి ఎదుర్కొన్న సమస్య మనలో చాలా మంది ఎదుర్కొంటున్నదే.. కానీ వారందరూ తనంత ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొని సమస్య పరిష్కారానికి ప్రయత్నించకపోవడం వల్లే సమస్య ఇంకా జటిలమవుతుంది. అందరిలా తను కూడా సమస్యను తలుచుకుని కుమిలిపోతూ ఏడుస్తుంటే.. మనం ఈ రోజు తన గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. తెగువ చూసి కోర్టును ఆశ్రయించి తనపై ఆ యువకుడు చేసిన ఆరోపణలను పటాపంచలు చేసింది. అందరికీ తన నిజాయితిని నిరూపించింది. అంతేకాదు.. ప్రేమ విషయంలో వైఫల్యం చెందినంత మాత్రానా మరొక జీవితాన్ని ఏర్పరచుకుని ఆనందంగా జీవించే హక్కు తనకు ఉందని చెప్పకనే చెప్పింది. తప్పుడు ఆరోపణలతో జీవితాల్ని నాశనం చేయచ్చనుకునే ఇలాంటి ఆకతాయిలకు చట్టపరంగా గట్టిగా బుద్ధి చెప్పింది.
యువతులెవరైనా సమస్యలెదురవగానే బెదిరిపోవడం మానుకోవాలి.. దాని పరిష్కారానికి మార్గాలు చూడాలి. అందరికీ తెలిస్తే ఏమనుకుంటారో అనే భావన మానుకోవాలి. అలా అనుకుంటూ మౌనం వహిస్తే, ఇతరులు వేసిన నిందలే నిజమని అందరూ నమ్ముతారు. తప్పుబట్టేవారు ఎలాగైనా తప్పుగానే చూస్తారు.. అలాంటి వారి గురించి ఆలోచించకుండా మీ నిజాయితిని నమ్ముకుని ధైర్యంగా ముందడుగు వేయండి. ఇది మీ జీవితం.. అర్ధం లేకుండా అర్ధాంతరంగా ముగించడం సమాధానం ఎన్నటికీ కాదు.
Als Read ;- ప్రేమించాడు.. చంపేశాడు.. రెండేళ్లతర్వాత బయటపెట్టాడు!