గుంటూరు జిల్లా కోటప్పకొండలో మట్టి దొంగలు చెలరేగిపోతున్నారు. నరసరావుపేట జిల్లాగా మారనుండటంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. సమీపంలోని వరి పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. లోతట్టు వరిపొలాలకు మెరక వేసేందుకు ప్రసిద్ధి శైవక్షేత్రం కోటప్పకొండపై వైసీపీ నేతల దృష్టి పడింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 400 టిప్పర్లను రంగంలోకి దింగారు. రోజుకు 1200 ట్రిప్పుల మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తరలించుకుపోతున్నారు. స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధికి ఒక్కో టిప్పర్ మట్టికి 1500 ఎస్ టాక్స్ చెల్లించి, కోట్లాది రూపాయల విలువైన మట్టిని తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మొద్దునిద్ర నటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమార్కుల దోపిడీ చూస్తుంటే, కోటప్పకొండను మింగేస్తారా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నెలకు రూ.6 కోట్ల విలువైన మట్టి దోపిడీ
రోజుకు 1200 టిప్పర్ల మట్టిని తరలిస్తున్న అక్రమార్కులు రోజుకు రూ.20 లక్షలు పోగేసుకుంటున్నారు. ఇక గనుల శాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి కూడా భారీగానే ముడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కోటప్పకొండలో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని చెబుతున్న గనుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పెద్ద ఎత్తున అధికారులకు నెలకు రూ.3 కోట్లు, వైసీపీ నేతలకు మరో రూ.3 కోట్లు ముడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి టిప్పర్లు హచ్ చెల్ చేయడంతో ఆమార్గంలో ప్రయాణీకులు బెంబేలెత్తిపోతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం అనుమానాలు మరింత పెంచుతోంది.
Must Read ;- మైలవరం వీరప్పన్ : వంద కోట్ల మట్టి.. ఎలా బొక్కేశాడబ్బా!?
మేమే తవ్వుకోవాలి
నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అండదండలతో కోటప్పకొండలో మట్టి తవ్వకాలు యధేచ్ఛగా సాగిపోతున్నాయి. మేము కూడా వైసీపీనే మేము కూడా తవ్వుకుంటామని కొందరు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. టిప్పర్లు పెట్టి మట్టి తీసుకున్నారో లేదో, వెంటనే నరసరావుపేట పోలీసులు రంగంలోకి దిగి టిప్పర్లను స్టేషన్ కు తరలించారు. వైసీపీ అయినా అందురూ తవ్వుకోకూడదు. ఇక్కడ ఎస్ టాక్స్ చెల్లించిన వారికే మట్టి తవ్వుకునేందుకు అనుమతులు ఉంటాయి. ఎవరు పడితే వారు మట్టి తవ్వుకుపోతే కోట్లు ఖర్చు చేసి గెలిచింది, చేతులు ముడుచుకుని కూర్చోడానికా అని సదరు ప్రజాప్రతినిధి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.
కోటప్పకొండ శైవ క్షేత్రానికి పొంచి ఉన్న ముప్పు
రోజుకు వందల టిప్పర్ల మట్టి తరలించుకుపోవడంతో త్రికోటేశ్వరస్వామికి ముప్పు పొంచి ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అక్రమార్కులను ఇలాగే వదిలేస్తే కొండలు మాయం చేసేలా ఉన్నారని, మీడియాతో వాపోయారు. మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చినా, పట్టించుకునే అధికారులు కానీ, వైసీపీ నేతలు కానీ లేకుండా పోయారు. మీరేదైనా రాసుకోండి మాపని మేం చేసుకుపోతాం, ప్రజలు మమ్మల్ని గెలిపించారనే ధీమాలో అక్రమార్కులు చెలరేగిపోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read ;- అరకుకు పంపిప్తా అంటున్న కొండపల్లి వీరప్పన్