దేశంలో కొవిడ్ -19 సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసన ధ్వనులు వినిపిస్తున్న తరుణంలో వారణాసి పార్లమెంటు పరిధిలోని కొవిడ్ పరిస్థితులపై సమీక్షలో మాట్లాడుతూ మోదీ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.అయితే జాతీయంగా,అంతర్జాతీయంగా మోదీ కన్నీరు పెట్టుకున్న అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో పలు సెటైర్లు వైరల్ అవుతున్నాయి.న్యూయార్క్ టైమ్స్ పేరుతో India PM Cries శీర్షికతో ఓ ఫొటో (పత్రిక స్ర్కీన్ షాట్ అని)సర్క్యలేట్ అవుతోంది.అయితే న్యూయార్క్ టైమ్స్ పేరుతో వైరల్ అవుతున్నఈ ఫొటో ఫేక్ అని తేలినా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.అదే సమయంలో ప్రముఖ,వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు.మోదీకి ఆస్కార్ ఇవ్వచ్చని కామెంట్ పెడుతూ ఓ వీడియోను పోస్టు చేశారు.
కొవిడ్ సెకండ్ వేవ్‌ను అరికట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ..
కొవిడ్ సెకండ్ వేవ్‌ను అరికట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని జాతీయంగా,అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.ఆస్ట్రేలియా, ఫ్రాన్స్,హాంకాంగ్,అమెరికా,బ్రిటన్ దేశాల్లోని పత్రికలు,టీవీ ఛానెళ్లు మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాయి.ప్రముఖ హెల్త్ మ్యాగజైన్ ది లాన్సెట్ కూడా మోదీ విధానాలను ప్రశ్నించింది.కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సరిపోవని చెబుతూనే వ్యాక్సిన్ల సేకరణ విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కథనాలూ,కార్టూన్లు ప్రచురించాయి.ఇక దేశంలో ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన ఇండియా టుడే ది ఫెయిల్డ్ స్టేట్ శీర్షికతో కవర్ స్టోరీని కూడా ప్రచురించింది.ఇక దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు కూడా వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నారు.అదే సమయంలో యూపీ,మహారాష్ట్ర,గోవా తదితర రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగాయి.పలు రాష్ట్రాల్లో హైకోర్టులు కూడా రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాలపై ప్రశ్నించాయి.వ్యాక్సిన్ల కొరత,ఆక్సిజన్ కొరత, బెడ్లు లేకపోవడంలాంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్నాయి.ఆర్ఎస్ఎస్ కూడా మోదీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.సాధారణ పరిస్థితుల్లో చాలా వరకు బీజేపీ ప్రభుత్వాలను వెనుకేసుకొచ్చే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ కూడా మోదీ ప్రభుత్వాన్ని విమర్శించిందంటే తెరవెనుక చాలా ఇష్యూ ఉండిఉండవచ్చనే చర్చ మొదలైంది.వ్యాక్సిన్ల సేకరణకు ఆర్డర్లు ఇచ్చే విషయంలోనూ మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విశ్లేషణలూ వచ్చాయి.
వారణాసిలో కొవిడ్ పరిస్థితులపై..
ఈ తరుణంలో సొంత నియోజకవర్గమైన వారణాసిలో కొవిడ్ పరిస్థితులపై మోదీ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో అక్కడి వైద్య సిబ్బంది,ఫ్రంట్ లైన్ వారియర్లతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.కొవిడ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతూ నిన్నమొన్నటి వరకు మనతోనే ఉండి ఇప్పుడు మనల్ని వదిలేసి వెళ్లడం బాధాకరమని వ్యాఖ్యానించారు.ఇందులో భాగంగా ప్రస్తుత పరిస్థితులు,అంచనాల నేపథ్యంలో కొవిడ్ పై దీర్ఘకాలిక పోరాటం సాగుతుందన్నారు.సమిష్టి పోరాటంతోనే కొవిడ్ నియంత్రణ సాధ్యమన్నారు.మొత్తం మీద మోదీ కన్నీరుపెట్టుకున్న వైనంపై కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు నేతలు సెటైర్లు వేస్తున్నారు.కాగా గతంలో 2014లో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో,కాంగ్రెస్ ఎంపీ గులాబ్ నబీ ఆజాద్ పదవీ కాలం పూర్తయిన సందర్బంలో,ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్‌తో జరిగిన సమావేశంలో మోదీ కన్నీరు పెట్టుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.











