ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. సరైన బ్యాకప్ లేదు. అయినప్పటికీ … వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫెయిల్యూర్స్ కు కుంగిపోకుండా.. సక్సెసే ప్రధానంగా ముందుకు సాగాడు. ఇప్పుడు టాలీవుడ్ లో బెస్ట్ హీరో అనిపించుకున్నాడు సత్యదేవ్. లేటెస్ట్ గా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సక్సెస్ తో మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాడు. ఆ క్రమంలో తమన్నా, కీర్తి సురేశ్ లాంటి అగ్రకథానాయకల సరసన నటించే స్థాయికి చేరుకున్నాడు.
2011 లో ప్రభాస్ మిస్టర్ పెర్ఫెక్ట్ లో ఒక చిన్నపాత్ర తో తొలిసారిగా టాలీవుడ్ తెరమీద కనిపించాడు సత్యదేవ్. కనిపించింది చాలా తక్కువ సేపే అయినా… మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి… పలువురు దర్శకుల దృష్టిని ఆకర్షించాడు. ఆపై ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మైనే ప్యార్ కియా, ముకుందా, అసుర’ లాంటి సినిమాల్లో సైతం తన టాలెంట్ చూపించాడు. అతడి నటనకి ముచ్చటపడ్డ పూరీ జగన్నాథ్ .. ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో ఏకంగా హీరోనే చేసేశాడు.
రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. ఆ సినిమాతో సత్యదేవ్ కి టాలీవుడ్ లో మంచి పెర్ఫార్మర్ గా పేరొచ్చింది. దీని తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా.. సత్యదేవ్ నటన పరంగా ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. ఎప్పటికప్పుడు బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేశాడు. ఆపై మంచి సినిమాతో తన కెరీర్ లో ఒక బ్రేక్ తెచ్చుకోవలనుకున్నాడు. ఆ కోరికను ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో తీర్చుకున్నాడు. ఆ ఒక్క సినిమా సత్యదేవ్ ను టాప్ హీరోయిన్స్ తో నటించే స్థాయికి తీసుకెళ్ళిపోయాయి.
రీసెంట్ గా సత్యదేవ్ హీరోగా ‘గుర్తుందా సీతాకాలం’ అనే సినిమా మొదలైంది. కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్ టెయిల్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సత్యదేవ్ సరసన తమన్నా లాంటి క్రేజీ భామ కథానాయికగా నటిస్తూండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాగశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మీద సత్యదేవ్ మంచి హోప్స్ తో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల తమిళంలో సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలో ‘సాణిక్కాయితమ్’ అనే ఒక సినిమా ప్రారంభం అయింది. అందులో కీర్తి సురేశ్ హీరోయిన్. ఆ మధ్య విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
అరుణ్ మాతేశ్వరన్ దర్వకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. హీరోగా సత్యదేవ్ నటించబోతున్నాడనే వార్తలొస్తున్నాయి. తమిళనాడులో 80ల్లో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. సెవెన్ స్ర్కీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమానే ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోనే విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేశ్, టాలీవుడ్ బెస్ట్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్నారు కాబట్టి.. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతుందని వేరే చెప్పనవసరం లేదు. మరి ఈ సినిమా సత్యదేవ్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో.. భవిష్యత్తులో ఇంకెంత మంది టాప్ హీరోయిన్స్ సరసన నటిస్తాడో చూడాలి.