#సేవ్ సినిమా– ఇప్పుడిది ఓ నినాదాం. తమిళ చిత్ర పరిశ్రమ గళం విప్పింది. తెలుగు చిత్ర పరిశ్రమ గొంతు కలిపింది. పదం పాడుతూ కదం తొక్కుతూ ఇకనైనా ఈ‘తెర’లు తొలగాలని కన్నీటి పొరలతో సినిమా ఆక్రోశిస్తోంది. చెన్నైలో పాండీ బజార్, హైదరాబాద్ లో కృష్ణానగర్…. ఖాళీ. షూటింగ్ పిలుపులు ఎవ్వరికీ అందడం లేదు. ఇంటి అద్దె కట్టలేరు… పస్తులతో గడపలేరు… అందుకే ఏమీ పాలుపోక పల్లెవైపే అడుగులు పడ్డాయి. 24 వృత్తుల్లోనూ చడీచప్పుడు లేదు… అందుకే సేవ్ సినిమా.
థియేటర్ కాంతులెక్కడ?
మనకు మనసు బాగోలేకపోతే మన అడుగులు సినిమా థియేటర్ వైపు పడతాయి. కొత్త బొమ్మ కోసం కళ్లు వెంపర్లాడతాయి. వారాంతం వస్తే మల్టీప్లెక్స్ ల దిశగానే అడుగులు?… ఆరోజులెక్కడ? ఆ సినిమా కళ ఎక్కడ? బుక్ మై షో అనేది ఒకటి ఉందనే అందరూ మరచిపోయారు. ఆ‘షో’కులు లేకపోగా శోకాలే మిగిలాయి. చేతిలో చిల్లిగవ్వ ఆడటం లేదు. సినిమాలో జీవితాన్ని చూసుకునేవారికి జీవితంలోనే సినిమా చూసుకోవాల్సిన గడ్డు పరిస్థితి దాపురించింది. ఇక ఏ టిక్కెట్లూ లేవు… అన్నీ ఇక్కట్లే… ఒకటా రెండా ఆరు నెలలు… ఎలా గడిచాయో కూడా తెలియడం లేదు. థియేటర్లో ప్రొజెక్టర్ కాంతి తెరపై పడిందంటే చాలు… చాలా జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతాయి. అక్కడ సందడి కనిపిస్తే చాలు.. సినిమాని నమ్ముకున్న బతుకుల్లోనూ సందడి ఉన్నట్టే. అలాంటి థియేటర్ తన కళని కోల్పోయింది.
‘తెర’వేల్పులెక్కడ?
మన తెరవేల్పులు మనుషుల్ని మరచిపోయారా… మెుక్కలే వారికి గుర్తుకొస్తున్నాయా? సినీ జీవులు ఎవరికి మొక్కాలి? ఏం చేస్తే సినిమా కళ మళ్లీ వస్తుంది. సినీ ఎరీనాను ఇలా కరోనా కమ్మేసిందేమిటి. 1600 థియేటర్లు మూతపడ్డాయి… 80 వేల మంది సినీ కార్మికులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రోడ్డున పడ్డారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది జీవితాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్టు చిత్ర పరిశ్రమ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిణామాల పర్యవసానంగా ‘సేవ్ సినిమా’ పేరుతో ఉద్యమం ఊపందుకుంది.
‘సపోర్ట్ మూవీ థియేటర్స్’ అంటూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమాల్లో తన వాణిని గట్టిగా వినిపిస్తోంది. ఇక ముందు రావలసింది మన తెలుగు హీరోలే. తమిళ చిత్ర పరిశ్రమ యావత్తూ ఇప్పటికే స్పందించింది. అన్ లాక్ 4.0లో ప్రభుత్వాలు షాపింగ్ మాల్స్‌కీ, విమానయానాలకూ, మెట్రోరైళ్లు ఇతరత్రా ప్రయాణాలకీ అనుమతిచ్చినా థియేటర్లకి అనుమతి ఇవ్వకపోవడం సమంజసం కాదంనే వాదన వినిపిస్తోంది. వెండితెర వెలిగితేనే తమ జీవితాలపై పడిన తెర తొలగుతాయని సినీ కార్మికులు అంటున్నారు.
– హేమసుందర్ పామర్తి