థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను కోరుకొనే ప్రేక్షకులు .. ముఖ్యంగా ఈ టైమ్ లో ఇంట్లో కూర్చుని ఓటీటీలో ఎంజాయ్ చేయదగ్గ మలయాళ హైస్ట్ మూవీ ‘జాక్ అండ్ డానియల్’. కోట్లు కొల్లగొట్టే దొంగ. అతడ్ని వెంటాడే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్. వీరిద్దరి మధ్యా హైడ్ అండ్ సీక్ గేమ్ ఈ సినిమా.
కథేంటి?: డానియల్ అలెగ్జాండర్(అర్జున్ సర్జా) ఒక ఇంటెలిజెంట్ పోలీసాఫీసర్. ఒకటిన్నర సంవత్సరంలో మొత్తం 1700కోట్లు నల్లధనాన్ని కాజేసిన ఒక దొంగ ను పట్టుకోడానికి నియమింపబడతాడు. కొద్దిరోజుల్లో ఆ దొంగ ఒక బిజినెస్ మేన్ అనే నిజం తెలుసుకుంటాడు డానియల్ . కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా అతడ్ని పట్టుకోవడం అసాధ్యమని గుర్తిస్తాడు. దాంతో సుస్మిత అనే పోలీసాఫసర్ ను అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా జాక్ దగ్గరకు పంపిస్తాడు. ఆమె ఫోటోగ్రాఫర్ గా జాక్ కు పరిచయం అవుతుంది.
ఆ ప్రయత్నంలో జాక్ గతాన్ని తెలుసుకుంటుంది. అతడొక ఎక్స్ మిలటరీ కమాండర్. ఒక ఆపరేషన్ లో భాగంగా .. తన అన్నను పోగొట్టుకుంటాడు. మిలటరీ లో డ్యూటీలో చనిపోయిన అతడికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందదు. ఆ కారణంగా అతడి భార్య ఆత్మ హత్య చేసుకుంటుంది. వారి పిల్లల సంరక్షణ బాధ్యతను జాక్ తీసుకొని.. తన అన్నలా మిలటరీలో చనిపోయిన కుటుంబాల వారికి సహాయం చేయడానికి దొంగగా మారతాడు. చివరికి డానియల్ అతడ్ని ఎలా పట్టుకుంటాడు? అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు?: గతంలో ఈ తరహా దొంగ పోలీసు కథలు చాలానే వచ్చినా.. ‘జాక్ అండ్ డానియల్’ మూవీ ప్రత్యేకతను చాటుకుంటుంది. జాక్ దొంగతనం చేసే విధానాన్ని చాలా ఇంటెజలిజెంట్ వేలో ప్రజెంట్ చేశాడు దర్శకుడు యస్.యల్. పురం జయసూర్య. ముఖ్యంగా అతడి తెలివితేటలు, ప్లానింగ్.. సెన్సాఫ్ హ్యూమర్ ఆకట్టుకుంటాయి. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే .. ఆసక్తికరమైన సన్నివేశాలు.. ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తాయి. సినిమా మొత్తం మీద బోర్ కొట్టని సన్నివేశం ఒక్కటి కూడా లేకపోవడం ఈ సినిమా ప్రత్యేకత. జాక్ గా మలయాళ జనప్రియ నాయకన్ దిలీప్ అదరగొట్టాడు. డానియల్ గా అర్జున్ సర్జా అలాంటి పాత్రలు తనకు కొట్టినపిండే అన్నట్టు.. పోలీస్ పాత్రలో జీవించాడు. ఇక సుస్మితగా అంజూ కురియన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇతర పోలీస్ పాత్రల్లో అశోకన్, సైజు కురుప్పు నటించారు.
హైలైట్స్ : పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక్కుండా .. జాక్ పాత్ర ధారి దొంగతనాలు చేసే విధానం ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం. అలాగే.. పోలీసాఫీసర్ తనని ఫాలో అవుతున్నా.. అతడికి ఎప్పటికప్పుడు టోకరా ఇవ్వడం ఆకట్టుకుంటుంది. ఇక చెప్పుకోదగ్గ మరో అంశం.. క్లైమాక్స్. అంతవరకూ మౌస్ అండ్ క్యాట్ లా సాగిన జాక్ అండ్ డానియల్ రైవలరీ.. ఒక ట్విస్ట్ తో వేరే టర్న్ తీసుకుంటుంది.
నటీనటులు : దిలీప్, అర్జున్ సర్జా , అంజు కురియన్, జనార్ధనన్, ఇన్నోసెంట్, అశోకన్, సైజు కురుప్పు, సురేశ్ కృష్ణ, దేవన్, సాధిక్, లక్ష్మీ గోపాలస్వామి తదితరులు
దర్శకత్వం : యస్.యల్.పురం జయసూర్య
ఒక్కమాటలో : ఇంటెలిజెంట్ హైస్ట్ థ్రిల్లర్
ఎక్కడ చూడాలి : అమెజాన్ ప్రైమ్ విత్ తెలుగు సబ్ టైటిల్స్
రేటింగ్ : 3.5 /5
–ఆర్కే











