భర్త నుంచి విడిపోయాక భార్య మెడలో మంగళసూత్రాన్ని తీసివేయడం పై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భర్త బతికుండగా భార్య మంగళ సూత్రాన్ని తీసివేయడం అంటే భర్తను ఆమె మానసిక క్రూరత్వానికి గురిచేయడమే అవుతుందని కోర్టు పేర్కొంది.మహిళలు ధరించే తాళి వైవాహిక జీవితానికి ఒక గొప్ప ప్రతీక అని..విడిపోవాలనుకున్న భార్య ముందుగా తాళి ని తీసివేయడం అనేది భర్తను మానసిక క్రూరత్వానికి గురిచేసినట్లు అవుతుందని..ఈ నేపధ్యంలో భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగించాలని చెన్నై హైకోర్టు తెలిపింది.
తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన సి. శివకుమార్ ఓ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తన భార్యతో ఏర్పడ్డ మనస్పర్ధయల కారణంగా ఆయన 2016లో విడాకులు కోరుతూ స్థానిక ఫ్యామిలీ కోర్టులో అప్పీల్ చేయగా దానిని అప్పటి ధర్మాసనం తిరస్కరించింది.కాగా నాటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ శివకుమార్ చేసిన అప్పీల్‌ను అనుమతిస్తూ జస్టిస్ వీఎం వేలుమణి, ఎస్.సౌంథర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
మహిళను పరీక్షించినప్పుడు విడిపోయిన సమయంలో ఆమె తన తాళిని తొలగించినట్టు శివకుమార్ భార్య అంగీకరించింది. అయితే, తాను గొలుసును మాత్రమే తొలగించానని, మంగళసూత్రాన్ని మాత్రం ధరించానని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ధర్మాసనానికి తన వాదనలు వినిపించిన శివకుమార్ భార్య తరఫు న్యాయవాది.. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7ను ప్రస్తావిస్తూ తాళి కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఆమె దానిని తొలగించినా వైవాహిక బంధంపై అది ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు.
అయితే, శివకుమార్ భార్య తరఫు న్యాయవాది వాదనను జస్టిస్ వీఎం వేలుమణి, ఎస్ సౌంథర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టేసింది. ప్రపంచంలోని భారతదేశంలో జరిగే వివాహ వేడుకల్లో తాళి కట్టడం అనేది ఒక ముఖ్యమైన ఆచారమని, అది అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొంది. హిందూ వివాహిత తన భర్త జీవించి ఉండగా ఏ సమయంలోనూ తాళిని తీసేందుకు సాహసించదని, కానీ ఆమె తన తాళిని తీసినట్టు స్వయంగా అంగీకరించిందని, దానిని బ్యాంక్ లాకర్‌లో పెట్టినట్టు పేర్కొందని ధర్మాసనం తెలిపింది.
మహిళ మెడలో తాళి పవిత్రమైన విషయమని, ఇది వైవాహిక జీవితం కొనసాగింపును సూచిస్తుందని కోర్టు పేర్కొంది. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగిస్తారని, కాబట్టి ఆమె చర్యను భర్తను మానసికంగా హింసించే చర్యగా చెప్పొచ్చని, ఇది అత్యున్నత స్థాయి మానసిక క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్న కోర్టు విడాకులు మంజూరు చేసింది.
2011 నుంచి పిటిషనర్, ఆయన భార్య వేర్వేరుగా నివసిస్తున్నారని, ఈ కాలంలో మళ్లీ తిరిగి ఒక్కటి కావాలనే ప్రయత్నం జరిగినట్టు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. భార్య తన చర్య ద్వారా భర్తకు మానసిక క్రూరత్వం కలిగించిన దృష్ట్యా పిటిషనర్, ప్రతివాది(భార్య) మధ్య వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.