టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ స్థానం ప్రత్యేకం. సుకుమార్ ఎంచుకునే కథలు కొత్తగా ఉంటాయి .. ఆయన పాత్రలను మలిచే తీరు విభిన్నంగా ఉంటుంది. ఆయన సినిమాల్లోని పాటలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఒక కథకు .. మరో కథకు పోలిక లేకుండా చూసుకుంటాడు. అలాగే ప్రతి సినిమా తన మొదటి సినిమా అనుకునే ఆయన కష్టపడతారు. అందుకే ప్రేక్షకులు ఆయన సినిమాలను అంతగా ఇష్టపడతారు. భారీగా వసూళ్ల మూటను తీసుకెళ్లి బాక్సాఫీస్ కి అప్పగించేస్తారు.
సుకుమార్ అంటే ఓ ప్రయోగం .. ఓ సాహసం అని చెప్పుకోవచ్చు. కథ .. కథనాలపై ఆయనకి మంచి పట్టుఉంది. తన సినిమాలకి తనే సంభాషణలు సమకూర్చుకుంటాడు. అందువల్లనే ఆయన సినిమాలు థియేటర్లకు రావడానికి కొంత ఆలస్యమవుతూ ఉంటుంది. నిదానమే ప్రధానం అన్నట్టుగా ఆయన వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఒక సినిమా పూర్తయితేనే తప్ప ఆయన మరో సినిమాను గురించి ఆలోచించడు. కొంతకాలంగా కథాకథనాలతో పాటు ఆయన హీరోల లుక్ విషయంలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ .. ‘రంగస్థలం’ .. ‘పుష్ప’ సినిమాలను అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.
ప్రస్తుతం ఆయన ‘పుష్ప’ సినిమాకి సంబంధించిన షూటింగులో బిజీగా ఉన్నాడు. అడవి నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకూ సుకుమార్ నుంచి వచ్చిన సినిమాలకి ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. బన్నీ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజున సుకుమార్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.