(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
సింహాచలం దేవస్థానం పరిధిలోని భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ప్రారంభమైన దర్యాప్తు తేనెతుట్టెను కదిపినట్టు అనేక వివాదాలకు, సంచలనాలకు దారితీస్తుందా? లేదా, ఒక వర్గాన్ని టార్గెట్ చేసే దిశగా ముగుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. దేవస్థానం భూములపై దర్యాప్తు కోసం తిరుపతి నుంచి వచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. సురేంద్ర సోమవారం రంగంలోకి దిగారు. జోన్ 2 తహశీల్దార్ , డిప్యూటీ తహశీల్దార్ లు, మరో ఇద్దరు సహాయంతో ఆక్రమణలకు గురైన ప్రదేశాల్లో పర్యటించి అప్పన్న భూములు ఏ మేరకు కబ్జాలకు గురైంది నిగ్గు తేల్చనున్నారు. వాస్తవానికి 15 రోజుల్లో దేవస్థానం భూముల సమగ్ర విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. ఎస్ డి సి నేతృత్వంలో ఇప్పటికే దేవస్ధానం సర్వేయర్‌తో, ఏఈవోలు, భూ పరిరక్షణ విభాగంలో పనిచేసిన ఇతర సిబ్బందితో సమావేశమై పలు విషయాలు ప్రాథమికంగా తెలుసుకున్నారు.
క్షేత్ర పర్యటన మొదలయ్యాక అవసరమైతే అదనపు సిబ్బంది కావాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పడం వెనుక భారీ కసరత్తు దాగి ఉందని స్పష్టమవుతోంది. ప్రభుత్వం నియమించిన ఈ బృందం ఏరియాల వారీగా ఏయే సర్వే నెంబర్లలో ఎంత భూమి ఆక్రమణకు గురైందో విచారణ జరపనుంది.
ఆక్రమణలకు గురైన ప్రదేశాలను మార్క్ చేసి నివేదిక ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ తనిఖీల ప్రక్రియ 15 రోజుల్లో పూర్తికాకపోతే మరింత గడువు ప్రభుత్వాన్ని కోరేందుకు ఎస్‌డిసి నేతృత్వంలోని బృందం సిద్ధంగా ఉంది.
2008లో సమగ్ర సర్వే..
సింహాచలం దేవస్థానానికి చెందిన పంచ గ్రామాల్లో ఉన్న భూముల్లో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి? ఎంతమేరకు భవన నిర్మాణాలు ఉన్నాయి? ఆ భవనం ఏరియాతో పాటు వారి ఆధీనంలో ఎంత ఖాళీ స్థలం ఉంది? ఈ సర్వే నంబర్లలో ఎంత భూమి కబ్జాకు గురైంది? ఎంత ఖాళీ స్థలం మిగిలి ఉంది? యజమానుల పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అప్పటి కలెక్టర్ శ్యామల రావు నేతృత్వంలో సర్వే చేసి హైకోర్టుకు సైతం సమర్పించారు. దాని ఆధారంగా భూములను క్రమబద్ధీకరించాలన్నది అప్పటి ప్రభుత్వ నిర్ణయం. కానీ కోర్టు వివాదాల కారణంగా ఈ ప్రక్రియ నేటికీ పూర్తికాలేదు. (ఇదిచదవండి : హడలెత్తిస్తున్న సంచైత)

తాజాగా అందిన ఫిర్యాదుల ఆధారంగా..
అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల నిర్మాణాలు, ఆక్రమణలు దేవస్థానం భూములలో యథేచ్ఛగా సాగిపోయాయి. ఈవోగా ఎవరున్నారనే మాటతో నిమిత్తం లేకుండానే.. కిందిస్థాయి సిబ్బంది, భూ పరిరక్షణ విభాగంలోని అధికారుల సహకారంతో దేవుడి భూములు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఇటీవలి కాలంలో వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ విచారణ పర్వం కొనసాగుతుందా? లేక అప్పటినుంచి (2008) ఆక్రమణలను కూడా గుర్తి స్తుందా? అన్నదానిపై ఈ విచారణ గమ్యం ఏంటన్నది స్పష్టమౌతుంది.











