ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొల్లగొట్టిన దాదాపు రూ.3300 కోట్ల ముడుపుల్లో 90 శాతం బిగ్‌బాస్‌కే చేరిందని సిట్ తేల్చింది. మిగతా 10 శాతం ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కెసిరెడ్డి నేతృత్వంలో పనిచేసిన క్యాష్ కొరియర్లు, క్యాష్ హ్యాండ్లర్ల వ్యవస్థ నిర్వహణ ఖర్చులకు, ఈ కుట్ర రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ ముఖ్య నాయకులకు నెలవారీ వాటాలు ఇచ్చేందుకు, అక్రమ దందా అమలులో భాగస్వాములైన అధికారులకు లంచాలకు ఖర్చు చేసినట్లు తేలింది. రాజ్ కసిరెడ్డి కమీషన్లతో పాటు మద్యం సరఫరా కంపెనీలు పెట్టుకుని రూ.వందల కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. ముడుపుల సొమ్ములో ఎవరి వాటా ఎంతో వివరిస్తూ సిట్ జాబితా సిద్ధం చేసింది.
ఇప్పటికే అరెస్టయిన నిందితులు, సాక్షుల విచారణలో వెల్లడైన అంశాలు, వాంగ్మూలాలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలోని సమాచారాన్ని వెలికితీసిన సిట్ ఈ వాటాల గుట్టు తేల్చింది. బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కో కేసుపై రూ.150 నుంచి రూ.600 వరకూ వైసీపీ ముఠా వసూలు చేసింది. ఇలా మొత్తం రూ.3,300 కోట్ల వరకూ కొల్లగొట్టి ఉంటారని ప్రాథమిక అంచనా. అందులో 90 శాతం అంటే దాదాపు రూ.2,970 కోట్లు ‘బిగ్‌బాస్’కు చేరాయని సిట్ అంచనా.
డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకుని, హవాలా మార్గాల్లో ఈ సొమ్ము రూటింగ్ చేసినట్లు వెల్లడైంది. ఎక్కువ భాగం బెంగళూరు, హైదరాబాద్‌ల్లో భూములపై పెట్టుబడులుగా పెట్టినట్లు, బినామీ కంపెనీలు పెట్టినట్లు సిట్ గుర్తించింది. ఈ మూలాలు వెలికితీస్తోంది. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు నూతన మద్యం విధాన రూపకల్పన, ఎంతమేర ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించటంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ముఖ్య నేతలకు నెలకు చెరో రూ.5 కోట్ల చొప్పున వాటాలు అందేవి. వారిద్దరూ అప్పట్లో ఎంపీలే. నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తలలో నాలుకలా వ్యవహరించేవారు.
రాజ్ కసిరెడ్డి ద్వారా ఎప్పటికప్పుడు ఈ డబ్బులు వారికి చేరేవి. ఓ నేతకు ముడుపుల వాటా సొమ్ము ఇవ్వటాన్ని మధ్యలో నిలిపేయటంతో విభేదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆ ముఖ్య నేత వైసీపీలో లేరు. మరో నేత ప్రస్తుతం ఆ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆయన ముడుపుల సొమ్ములో వాటాలు పొందటంతో పాటు ఓ డిస్టిలరీని గుప్పిట్లో పెట్టుకుని సొంత బ్రాండ్లతో మద్యం తయారు చేయించినట్లు సిట్ గుర్తించింది. ఆ మద్యాన్ని APSBCLతో ఎక్కువగా కొనుగోలు చేయించి..భారీగా కొల్లగొట్టారు. వీరితో పాటు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య స్థానంలో ఉన్న మరో నేతకు నెలకు రూ.50 లక్షల చొప్పున ఇచ్చేవారని సిట్ గుర్తించింది.
వైసీపీ ముఠా APSBCLలో ఇద్దరు కీలక అధికారులను నియమించుకుని వారితో కథ నడిపించింది. ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వటం, ముడుపులు ఇవ్వని కంపెనీలను మార్కెట్ నుంచి తరిమేయటం లాంటి పనులు వీరితో చేయించింది. ప్రతిఫలంగా ఓ ముఖ్య అధికారికి నెలకు రూ.50 లక్షలు, మరో అధికారికి నెలకు రూ.20 లక్షల చొప్పున లంచాలుగా చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఆ ఇద్దరు అధికారులు రాజ్ కసిరెడ్డి సూచించిన కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారు.
పెద్ద కుంభకోణం జరుగుతుంటే..అన్నీ తెలిసి మౌనంగా ఉన్నందుకు, పరోక్షంగా వాటికి సహకరించినందుకు ఓ కీలక అధికారికి ఈ ముఠా అప్పుడప్పుడూ భారీగా నగదు ప్యాకెట్లు అందజేసేది. ఒక్కో విడతలో రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి చొప్పున అందజేసేదని సిట్ గుర్తించింది. తనకు డబ్బులివ్వట్లేదని, పట్టించుకోవట్లేదని భావించిన ప్రతి సందర్భంలోనూ ఆ అధికారి..ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ APSBCLకు ఓ మెమో ఇచ్చేవారు. ఇలా దాదాపు 35 మెమోలు ఇచ్చారని గుర్తించి వాటికి సంబంధించి కీలక ఆధారాల్ని సిట్ సేకరించింది.
ముఖ్య నేతలకు వాటాలు, అధికారులకు లంచాలు పోనూ మిగతా సొమ్మును రాజ్ కెసిరెడ్డి ముడుపుల వసూళ్ల వ్యవస్థ నిర్వహించినందుకు కమీషన్‌గా తీసుకునేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, ముప్పిడి అవినాష్‌రెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్‌లను ముందు పెట్టి క్యాష్ హ్యాండ్లర్ల వ్యవస్థను నిర్వహించేవారు. అంతేకాకుండా రాజ్ కసిరెడ్డి.. తన వారితో కొత్తగా కొన్ని మద్యం సరఫరా కంపెనీలను ఏర్పాటు చేయించి.. వాటికి భారీగా సరఫరా ఆర్డర్లు దక్కేలా చేసుకున్నారు. దాదాపు 5 కంపెనీలకు రూ.వందల కోట్లు APSBCL నుంచి జమయ్యాయి. ఈ డబ్బుతో రాజ్ కసిరెడ్డి ముఠా కూడా పలుచోట్ల భూములు కొనుగోలు చేసింది..సినిమాలు తీసింది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టింది. దుబాయ్‌లో అనేక కంపెనీలు కూడా ఏర్పాటు చేసింది. ఈ వివరాలన్నీ సిట్ దర్యాప్తులో బయటపడ్డాయి.











