పుష్కరం అంటే 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మనకున్న 12 రాశుల్లోకి గురువు మారినప్పుడల్లా పుష్కరాలు వస్తుంటాయి. గురువు మారే రాశుల్ని బట్టి ఆయా నదులకు పుష్కరాలు వస్తుంటాయి. ఈ నెల 20వ తేదీన గురువు ధనుస్సు నుంచి ఉత్తరాషాడ 2వ పాదం, మకరరాశిలోకి 01.23 నిముషాలకు ప్రవేశిస్తున్నాడు. గురువు మకర రాశిలోకి వెళితే తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాలకు సంబంధించిన వివరాలను దేవాదాయ శాఖ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది. డిసెంబరు 1వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు కొనసాగుతాయి. దాదాపు 12 సంవత్సరాల క్రితం 2008లో ఈ నదికి పుష్కరాలు వచ్చాయి.
పుష్కర ఘాట్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. స్నానాల కోసం ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. నదిలోకి దిగకుండానే జల్లు స్నానాలు చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ఘాట్ల వద్ద స్ప్రింక్లర్ లను ఏర్పాటు చేస్తున్నారు. పితృదేవతలకు పిండ ప్రధానాలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ఏర్పాటుచేశారు. 443 మంది పురోహితులను నియమించారు. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మొదటిరోజు పుష్కరాలకు హాజరవుతున్నారు. కర్నూలులోని సంకల్‌బాగ్ పుష్కర ఘాట్ ఆయన సంప్రదాయ బద్ధంగా పూజలు చేసి స్నానం చేస్తారు. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
పుష్కర స్నానం పుణ్య ప్రదం
పుష్కర సమయంలో చేసే స్నానం ఎంతో పుణ్య ప్రదమని భక్తుల నమ్మకం. పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త రుషులు ఆయనను గౌరవించి సత్కరిస్తారని చెబుతుంటారు. వారంతా సూక్ష్మ రూపాల్లో ఆ నదిలో ఉంటారని అంటుంటారు. అందుకే పుష్కర సమయంలో చేసే స్నానం చాలా పవిత్రమైనదని నమ్మకం. దేవతలు కూడా సూక్ష్మ రూపాలలో నదుల్లో ఉంటారని ప్రతీతి. ఈ సమయంలో చేసే పూజలు, జపాలు, తర్పణాలు, దానాలు లాంటి వాటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందరూ ఈ పుష్కర స్నానం చేసి తరంచటానికి తహతహలాడుతుంటారు.
Must Read:- జగన్ అతి భక్తికి ఇది నిదర్శనమా?










