తిరుమల తిరుపతి దేవస్థానములు (టిటిడి) ఆదాయ, వ్యయాలపై ఇకనుంచి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చే ఆడిట్ చేయించాలని టిటిడి పాలకమండలి తీర్మానం చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటే ఇకనుంచి టిటిడి ఆదాయ వ్యయాలను కాగ్ ఆడిట్ చేయనుంది.
కాగా ఇదే విషయమై హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది. టీటీడీకి భక్తులు, దాతలు నుంచి ప్రతి ఏడాది వేలాది కోట్ల రూపాయలు ఆదాయం వస్తోంది. టీటీడీ వార్షిక బడ్జెట్ మూడు వేల కోట్ల రూపాయలు దాటింది. సొంత ఆడిట్ కుదరదని కాగ్ ఆడిట్ జరగాలనే డిమాండుతోనే హైకోర్టులో కేసు నడుస్తోంది. ప్రస్తుతం టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో హైకోర్టు కేసు ఒక కొలిక్కి వచ్చేస్తుందని ఆశించవచ్చు.
ఇప్పటివరకు టీటీడీలో రెండు విధాలుగా ఆడిట్ జరుగుతోంది. టిటిడి నియమించిన సిఏలతో ఇంటర్నల్ ఆడిట్, రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ విభాగంతో మరో ఆడిట్ జరుగుతోంది. గతంలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, టిటిడి ఆదాయ, వ్యయాలపై కాగ్‌చే ఆడిట్ చేయించాలని టిటిడి కోరగా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, మరో వ్యక్తి సత్య సబర్వాల్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఈ కేసు విచారణ జరుగుతోంది.
ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి టి టి డి లో కాగ్‌చే ఆడిట్ నిర్వహించడానికి ఆమోదిస్తూ పాలకమండలి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. దీనివల్ల భక్తులు, దాతల్లో టిటిడి పట్ల విశ్వాసం మరింత ఇనుమడిస్తుందని భావిస్తోంది.
అదేవిధంగా గత ఐదు సంవత్సరాల కాలానికి (2014-15 నుంచి 2019-20) సైతం ప్రత్యేకంగా కాగ్ చే ఆడిట్ నిర్వహించాలని టీటీడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. కాగా టిటిడి తీర్మానంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని, కాగ్ కు నివేదించాల్సి ఉంటుంది. కాగ్ చే టీటీడీలో ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వం సైతం ఆమోదిస్తే, కేసు విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
స్వామి ట్వీట్ ద్వారానే వెలుగులోకి
కాగ్ ద్వారా టీటీడీ ఆడిట్ జరిపించాలనే పాలకమండలి తీర్మానానికి జగన్మోహన్ రెడ్డి ఆమోదించారని, అందుకు థాంక్స్ చెబుతూ భాజపానేత సుబ్రమణ్య స్వామి 2వ తేదీన ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాతే అసలు టీటీడీ గతవారం పాలకమండలి భేటీలో ఇలాంటి తీర్మానం చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. పాలకమండలి సమావేశం తర్వాత.. ప్రెస్ మీట్ లో ఈ విషయం ప్రకటించలేదు. కానీ స్వామి ట్వీట్‌తో ఇలాంటిది జరిగింది అనే సంగతి తెలిసింది. జగన్ ప్రభుత్వం ఆమోదించినట్లయితే.. స్వామి హైకోర్టులో నడుపుతున్న పిటిషన్ ఉద్దేశ్యం నెరవేరినట్టే. అచ్చంగా ఆయన పిటిషన్ లో డిమాండ్ చేసిన మేరకే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగ్ ఆడిట్‌తో ఏమవుతుంది?
కాగ్ అనేది ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టు వంటి వాటి తరహాలో ప్రభుత్వాలతో నిమిత్తం లేని ఒక స్వతంత్ర వ్యవస్థ. ఎవ్వరి ఒత్తిడులు వారి మీద పనిచేయవు- ఆడిటింగ్ అనేది పారదర్శకంగా, స్వతంత్రంగా జరుగుతుంది అనే అభిప్రాయం అందరికీ ఉంటుంది. టీటీడీ కాగ్ పరిధిలోకి వెళితే.. టీటీడీ తమ నిధులను ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోవడానికి, కేటాయింపులు చేసుకోవడానికి ఉండదు. అచ్చంగా టీటీడీ వ్యవస్థలోని నిర్దేశకాలు ఏం చెబుతాయో.. వాటికి మాత్రమే ఖర్చు పెట్టగలరు. ఇలాంటి ఆడిటింగ్ వల్ల.. టీటీడీ సొమ్ములను రాష్ట్రప్రభుత్వాలు వాడుకోవడం వంటి ‘అడ్జస్ట్‌మెంట్స్’కు వీలు కుదరదు. వాటిని కాగ్ తప్పుపడుతుంది.
పాతప్రభుత్వంపై నిందలకోసమేనా?
ఇప్పుడు గత అయిదేళ్ల పాలనలో టీటీడీ పద్దుల మీద కూడా కాగ్ తోనే ఆడిటింగ్ చేయించాలని ఇప్పటి బోర్డు తీర్మానించింది. జగన్ ప్రభుత్వం సమ్మతించడం అధికారికంగా వెల్లడైతే.. కాగ్ ఆడిట్ చేయవచ్చు. గత అయిదేళ్లు అంటే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో లెక్కల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో నిగ్గుతేలుస్తారు. గత అయిదేళ్ల చంద్రబాబు పాలన మీద అనేక కోణాల్లో ఇప్పటికే విచారణకు జగన్ సర్కారు ఆదేశించింది. టీటీడీ అయిదేళ్ల పద్దులను కాగ్ విచారిస్తే.. ఆ పరంగా జరిగిన తేడాలు కూడా వెలుగులోకి వస్తాయి.
సీఎం జగన్ కు అభినందనలు తెలుపుతూ సుబ్రమణ్య స్వామి చేసిన ట్వీట్ :
My associate Satyapal Sabharwal and I had filed a PIL in Andhra HC seeking a CAG audit of Tirupati Temple funds for the last 5 years& hereafter. The CM Jagan gracefully consented. TTD Chm. Subba Reddy & Member & VHS AP leader Govind Hari piloted it thru TTD Board. Task complete!
— Subramanian Swamy (@Swamy39) September 2, 2020
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చేసిన తీర్మానం ప్రతిని కనబరుస్తూ.. సుబ్రమణ్య స్వామితో పాటు హైకోర్టులో పిటిషన్ వేసిన సత్య సభర్వాల్ చేసిన ట్వీట్ :
WP (PIL) was co-petitioned by Dr. @Swamy39 and I praying for an external audit by CAG for last 5 years.
Today, Tirumala Tirupati Devasthanam through Res No. 141 has agreed and requested the State to conduct the audit & file affidavit in Court. Huge Win.
(Resolution attached) pic.twitter.com/5t6AEWnvRL
— Satya Anand Sabharwal (@satyasabharwal) September 2, 2020











