ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీనే నమ్ముకుంటోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి నుంచి బుద్ధి తెచ్చుకొని వ్యవహరిస్తోంది. అయినా.. కొన్ని విషయాల్లో మాత్రం గుడ్డిగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పేరుతో ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్ అడ్డగోలుగా మార్చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ పని చేయకపోవడం వల్లే అక్కడ ఆ పార్టీ ఓడిపోయిందని జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే తాను చేయించుకున్న సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చినట్లుగా మార్చేస్తున్నారు. అయితే, తాజాగా బీఆర్ఎస్ అనుసరించిన మరో పద్ధతిని కూడా వైఎస్ఆర్ సీపీ ఫాలో అవుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ అనుసరించిన వ్యూహాల్లో సోషల్ మీడియా ప్రధానమైంది. దీంట్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ని టార్గెట్ చేశారు. వారితో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని చెప్పించారు. సురేఖా వాణి కుమార్తె, శివజ్యోతి లాంటి సెలబ్రిటీలతో భారీగా బీఆర్ఎస్ తరపున సోషల్ మీడియాలో ప్రచారం చేయించారు. బీఆర్ఎస్ ప్రచార చిత్రాలకు డాన్సులు కూడా చేయించారు. పైగా మంత్రి కేటీఆర్ కూడా పేరు మోసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ తో కలిసి వీడియోలు చేశారు. తీరా చూస్తే ఆవేవీ ఆ పార్టీకి కలిసి రాలేదు. మొత్తానికి ఓడిపోయింది.
ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ కూడా బీఆర్ఎస్ అనుసరించిన ఫార్ములానే నమ్ముకొని ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా జబర్దస్త్ యాంకర్, బిగ్ బాస్ ఫేం అయిన సిరి హన్మంత్ తో వైసీపీ ఓ రీల్ చేయించింది. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ అందులో సిరి హన్మంత్ అడిగింది. నాడు నేడు ప్రొగ్రాంతో గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయ్యాయా లేదా? ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు ఉచిత వైద్యం అందుతుందా లేదా? రైతు భరోసా కింద రైతులకి ఆర్థిక భరోసా అందుతుందా లేదా? అంటూ సిరి హన్మంత్ ప్రశ్నించారు.
పెద్ద పెద్ద భవంతులు కట్టడమే డెవలప్ మెంట్ కాదని.. పేదలకు అన్ని వనరులు, అవకాశాలు కల్పించినవాడే నిజమైన లీడర్ అంటూ జగన్ ను పైకి ఎత్తేస్తోంది. మరి.. మద్యపాన నిషేదం, సీపీఎస్ రద్దు, పోలవరం పూర్తి, రాజధాని లాంటి అంశాల గురించి ఆమె ఏం మాట్లాడలేదు. ఈ ప్రశ్నలు కూడా అడిగి ఉంటే బావుంటుందని సిరి హన్మంత్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సినిమా రంగంలో అవకాశాల గురించి చూసుకోకుండా.. ఓడిపోయే ప్రభుత్వం గురించి ప్రచారం చేస్తూ ఎందుకు విలువ తగ్గించుకుంటున్నావని మరికొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.











